Read more!

దీపావళి పండుగ అంతరార్థం!

మన దేశంలో జరుపుకుంటున్నన్ని పండుగలు ఏ ఇతర దేశాల్లోనూ జరుపుకోరు. అయితే ఇన్ని పండుగలనూ, పర్వ దినాలనూ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? పండుగ రోజున అభ్యంగనస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకుని తినడం, బంధు మిత్రులతో సంతోషంగా గడపడం… పండుగలు జరుపుకోవడంలో ఇంతకన్నా వేరే ప్రయోజనాలు లేవా? అని తరచి చూస్తే.. సత్ప్రవర్తన, సదాచారాలను అలవరచు కోవడానికీ. సంస్కృతీ, సంప్రదాయాలను ఇనుమడింపజేసుకోవడానికీ ఉద్దేశించినవే పండుగలు.

జీవితం అనే నదికి సంస్కృతీ సంప్రదాయాలు రెండు తీరాల లాంటివి. అందులో ప్రవహించే నీరే ధర్మం. మోక్షానికి ఆధారమైన ధర్మాన్ని ఆచరించినప్పుడే అనంతమయిన సముద్రంలో నది సంగమించినట్లు మానవుడు మాధవునిలో ఐక్యం చెందుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్థమైన 'మోక్షం'.

దేశమంతటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగల్లో 'దీపావళి' ఒకటి. మన జీవితాల్లో దుఃఖమనే చీకటి పోయి సంతోషమనే వెలుగు వెల్లివిరియాలని, అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానకాంతులు విరాజిల్లాలనీ ఆకాంక్షిస్తూ జరుపుకొనే పండుగ 'దీపావళి'.

మన జీవితాలు శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలంటే మనలో సత్యధర్మాలు, త్యాగం, సేవాభావాలనే సుగుణాలు వికసించాలి. అలాగే అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన చేయాలి.

దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో నరకాసురుని సంహారం ఒకటి. ప్రాగ్జ్యోతిష పురాన్ని నరకాసురుడు పాలించేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని హింసించేవాడు. నరకాసురుని బారి నుండి తమను రక్షించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధం చేసి, నరకాసురుణ్ణి సంహరించాడు. అసురులు పెట్టే బాధల నుండి విముక్తి కలిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం 'దీపావళి' పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది.

ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది..

 శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు 

దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెందాడ నీ ప్రావీణ్యంబులు సూడఁగోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి నన్నీ వెంటం గొనిపొమ్ము.. అని సత్యభామ అడుగుతుంది. 

 'ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పొమ్ము” అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది. 

అప్పుడు శ్రీకృష్ణుడు రణరంగం విహార స్థలం కాదనీ అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావనీ.. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలనీ.. అక్కడ ఉన్నవి రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు అనీ సత్యభామను నిరుత్సాహపరుస్తాడు.

అప్పుడు సత్యభామ దానవులైన నేమి? మఱి దైత్య సమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక?.. అని అంటుంది. 

"ప్రభూ! దుర్గాల్లాంటి నీ బాహువులు నాకు అండగా ఉండగా రాక్షస సైన్యం వల్ల నాకేం భయం?”. అని శ్రీకృష్ణునిపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామను తనతోపాటు యుద్ధ రంగానికి తీసుకువెళ్ళాడు.

వీణను కూడా పట్టుకోవడం చేతకాని సత్యభామ విల్లును ఎలా పట్టుకుంటుందీ, దారానికి ముత్యాలు గుచ్చలేని కోమలి వాడి అయిన బాణాలను ఎలా సంధిస్తుందీ అని అందరూ సందేహించారు. అందరి సందేహాలూ పటాపంచలయ్యేలా సత్యభామ బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని యుద్ధ రంగం నుండి పారిపోయేలా చేసింది. అప్పుడు 'విజయం నిన్నే వరించింది' అంటూ సత్యభామ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి వరకూ యుద్ధమంటే తెలియని సత్యభామ అంతటి పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించగలిగింది? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? సత్యభామకు ధైర్యసాహసాల్ని ప్రదర్శించే శక్తి శ్రీకృష్ణుని నుండి వచ్చింది. ఓ భార్యకు భర్త అండ ఉంటే దక్కిన విజయమది. స్త్రీలో అంతర్లీనంగా ఉన్న శక్తి బయటకు వచ్చి చేకూర్చిన విజయమది. ప్రతి మహిళకు ఇలాంటి సహకారం తప్పనిసరిగా అవసరం.


                                  *నిశ్శబ్ద.