లక్నో వన్డే..సంజూ శ్రమ వృధా..9 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
posted on Oct 6, 2022 @ 12:08AM
లక్నోలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ పై 9 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా ఎంత ఆలస్యంగా ప్రారంభ మైన మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించారు. డాషింగ్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, క్లాసన్‌లు భారత్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదు ర్కొంటూ అద్బుత బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రేక్ష కులను ఆకట్టుకున్నారు. క్లాసన్ 65 బంతుల్లో 74, మిల్లర్ 63 బంతుల్లో 75 పరుగులు, డీ కాక్ 54 బంతుల్లో 48 పరుగులు చేసి తమ జట్టకు 249 పరుగుల భారీ స్కోర్ రావడంలో కీలకపాత్ర వహించారు. దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల చేసింది. భారత్ 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కట్టడి చేయడంలో భారత్ బౌలర్లు అంతగా సఫలీకృతం కాలేదు. పేసర్ సిరాజ్ 49 పరుగులు, బిష్ణోయ్ ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నారు. శార్దూల్ 35 పరుగు లిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక భారత్ ఇన్నింగ్స్ చివరి భాగంలో వచ్చి అప్పటికే విజృంభించి ఆడుతున్న శాంసన్‌తో కలిసి పరుగుల వరదే సృష్టించాడు.
250 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన భారత్ ఊహించనివిధంగా పేలవంగా బ్యాట్ చేసింది. కెప్టెన్ ధవన్, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ ఇద్దరూ 6వ ఓవర్‌కే పెవిలియన్ చేరారు. అప్పటికి జట్టు స్కోర్ మరీ 8 పరుగులే! పదో ఒవర్ అయ్యేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 24 పరుగులతో ఉంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కానీ రితిరాజ్, కిషన్‌లు ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టారు. వారిద్దరూ 62 బంతుల్లో 37 పరుగులు చేశారు. తొలి వన్డే ఆడుతున్న రితిరాజ్ గైక్వాడ్ ఫరవాలేదని పించాడు. కానీ 18 వ ఓవర్లో వెనుదిరిగేడు. అప్పటికి అతను 17 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 50కి చేరుకుంది. ఆ తర్వాత ఓవర్లోనే కిషన్ వెనుదిగాడు. అతను 37 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ దుస్థితి నుంచి జట్టును బయటపడేయడానికి సంజూశాంసన్ రంగంలోకి దిగాడు. ఎంతో ఆచీ తూచీ ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెడుతూ పరుగులు సాధించాడు. శాంసన్‌తో పాటు అయ్యర్ జోడీగా జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించారు. 23వ ఓవర్‌కి భారత్ స్కోర్ 100కి చేరుకుంది. అప్టికి అయ్యర్ 34 పరుగులు శాంసన్ 12 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి అప్పటికి 34 బంతుల్లో 53పరుగులు సాధించారు. శ్రేయస్ అయ్యర్ అర్ధసెంచరీని 33 పరుగుల్లో చేశాడు. 27వ ఓవర్లో అయ్యర్ అవుటయ్యాడు. అప్టికి జట్టు స్కోర్ 5 వికెట్లనష్టానికి 118 పరుగులు.
అయ్యర్ స్థానంలో వచ్చిన శార్ధూల్ ఠాకూర్ వస్తూనే ధాటిగా ఆడుతూ పరుగులు సాధించడంలో శాంసన్‌కు జోడీ అయ్యాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ దక్షిణాఫ్రికా బౌలర్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. 30వ ఓవర్లలో భారత్ 150 పరుగులు పూర్తి చేసింది. 37 ఓవర్లో 200 పరుగులు సాధించింది. శాంసన్ 180 రన్‌రేట్ తో 49 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. అక్కడి నుంచి దక్షిణాఫ్రికా బౌలర్లను కంగారుపెట్టించాడు. ముఖ్యంగా ఎన్గిడీ, షంసీలను బాదాడు. 38వ ఓవర్లో శార్దూల్ వెనుదిరిగేప్పటికి అతను 31 బంతుల్లో 33పరుగులు సాధించాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు వికెట్లు ఆవేష్, కుల్దీప్‌లు పెవిలియన్ చేరడంతో విజయం సాధించడం కష్టమైంది. అప్పటికీ శాంసన్ ఎంతో ధాటిగా ఆడుతూ స్కోర్‌ను దగ్గరికి తీసికెళ్లాడు. చివరి రెండు ఓవర్లు ఎంతో ధాటిగా బ్యాట్ చేశడు. ముఖ్యంగా షంషీ వేసిన చివరి ఓవర్లో 30 పరుగులు రావాలి. శాంసన్ మరింత దూకుడుగా ఆడుతూ ఒక సిక్స్ మూడు ఫోర్లు కొట్టి దక్షిణాఫ్రికాను ఖంగారు పెట్టాడు. అయినా కేవలం 9 పరుగుల దూరంలో భారత్ ఓటమి చవిచూసింది. సంజూ శాంసన్ 62 బంతుల్లో 86 చేసి అజేయంగా నిలిచాడు.