దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఆశలు గల్లంతు.. నెదర్లాండ్స్ చేతిలో చిత్తు
posted on Nov 6, 2022 @ 11:41AM
వరల్డ్ కప్ విజయం దక్షిణాఫ్రికాకు మరో సారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి వైదొలగింది. పసి కూన నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగు తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి ఔటైపోయింది. ఇన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన వరల్డ్ కప్ ను ఈ సారి ఎలాగైనా సాధించి తీరాలని, ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశే మిగిలింది.
గ్రూప్ బిలో నిన్నటి (నవంబర్ 5) వరకూ అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆదివారం(నవంబర్ 6)న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాలో పరాజయం పాలయ్యింది. దీంతో సఫారీల వరల్డ్ కప్ ఆశలు గల్లంతయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది.
159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిల బడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో మ్యాచ్ ని కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సఫారీలకు వరల్డ్ కప్ అందని ద్రాక్షే అన్న సంగతి మరో సారి రుజువైంది. అద్భుతమైన బ్యాటింగ్ తో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచిన నెదర్లాండ్ బ్యాటర్ ఆకెర్మాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.