ఒక్క ఫోన్ కాల్ తో 22 మందికి ప్రాణం.. సోను సూద్ కు వందనం
posted on May 5, 2021 @ 11:48AM
కరోనా కల్లోలం కష్టాల్లో ఉన్న జనాలకు ఆపద్భాదంవుడిగా నిలుస్తున్నారు నటుడు సోనూ సూద్. గత సంవత్సరం కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన సాయం చేస్తూనే ఉన్నారు.ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. పేదలకు ప్రాణం పోశారు. ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల తరలింపు నుంచి కష్టకాలంలో ఉన్న ఎంతో మందిని ఆయన తన సొంత డబ్బుతో ఆదుకున్నారు. ప్రత్యేక రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేసి బాధితులకు సాయపడ్డారు సోనూ సూద్.
పేదల పేలిట పేన్నిధిగా మారిన సోను సూద్ కు ఇటీవలే కరోనా సోకింది. అయినా క్వారంటైన్ లో ఉంటూనే సేవా కార్యక్రమాలు కొనసాగించారు. తన ఆస్తులను తాకట్టు పెట్టీ మరీ పేదలకు ఖర్చు చేశారు. తాజాగా బెంగళూరులో తనకు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ కు వేగంగా స్పందించి 22 మంది ప్రాణాలు కాపాడారు రియల్ హీరో. రాత్రంతా తన్ టీమ్ ను అలర్ట్ చేసి.. , 22 ప్రాణాలను కాపాడి, తానేంటో మరోసారి నిరూపించుకున్నారు సోనుసూద్.
బెంగళూర్ ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోయింది. పదుల సంఖ్యలో రోగులు ఆక్సిజన్ పై ఉన్నారు.ఈ విషయాన్ని యహలంక పాత బస్తీ ఇనస్పెక్టర్ సత్యనారాయణ సోనూ సూద్ దృష్టికి తీసుకుని వెళ్లారు. విషయాన్ని సోనూ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ కు ఆయన చెప్పగానే, పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే ఆయన టీమ్ ను అలర్ట్ చేశారు. అప్పటికే ఆక్సిజన్ కారణంగా ఆసుపత్రిలో ఇద్దరు బాధితులు కన్నుమూయగా, మిగతావారిని కాపాడాలన్న ఆదేశాలు అందాయి. దీంతో గంటల వ్యవధిలోనే సోనూ టీమ్ 15 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది.
"ఇది నా కృషి కాదు. నా టీమ్ చేసిన అద్భుతం. కేవలం కొద్దిమంది మాత్రమే సమష్టిగా పనిచేశారు. సత్యనారాయణ నుంచి కాల్ రాగానే, మేము దాన్ని వెరిఫై చేశాము. నిజమని తెలియగానే నిమిషాల వ్యవధిలో పని మొదలైంది. రాత్రంతా ఆసుపత్రికి ఆక్సిజన్ ను అందించేందుకు శ్రమించాం. మేము ఆలస్యం చేసుంటే ఎన్ని ప్రాణాలు పోయుండేవో తెలియదు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా హష్ మత్ అనుక్షణం నాతో మాట్లాడుతూ, మిగతా వారిని సమన్వయపరుస్తూ ఆసుపత్రికి సాయం చేశారు. ఇందుకు నాకెంతోగర్వంగా ఉంది" అని ఈ సందర్భంగా సోనూ సూద్ వ్యాఖ్యానించారు.
సకాలంలో హాస్పిటల్ కు ఆక్సిజన్ అందించి 22 మంది ప్రాణాలు కాపాడిన సోనుసూద్ కు అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి. నెటిజన్లు సోనుకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పని చేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారని కొనియాడారు. అధికారులు కూడా ప్రభుత్వంతో కాదని.. సోనుసూద్ ను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.