ఇన్ చార్జికి ముఖం చాటేసిన సోము వీర్రాజు? ఆయన సీన్ అయిపోయిందా?
posted on Feb 26, 2023 @ 11:11PM
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధిష్ఠానం ఆయనపై ఆగ్రహంగా ఉందా? రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడానికి సోము వీర్రాజు తీరే కారణమని భావిస్తోందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని తెలియడం వల్లనే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ రాజమహేంద్ర వరం వచ్చినా ఆయనను కలవకుండా మొహం చాటేశారని అంటున్నారు.
ఏపీ బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో మెజారిటీ నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుని సమస్య పరిష్కారం కోసం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేంద్ర మంత్రి మురళీధరన్ రాష్ట్రానికి వచ్చారు. నేరుగా రాజమహేంద్రవరం వెళ్లారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఆయనకు ఎదురుపడలేదు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రాష్ట్ర పర్యటనకు వస్తే పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఎదురు వెళ్లి ఆహ్వానించడం అన్నది ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా సోము వీర్రాజు అసలు మురళీధరన్ కు ఎదురు పడలేదు. ఆయన రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సమయంలో సోము వీర్రాజు కడప పర్యటనకు వెళ్లారు.
ఏపీ బీజేపీలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారు. అందుకే ఆయన మురళీధరన్ కు మొహం చాటేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఏపీ నుంచి పలువురు నేతలు హస్తిన వెళ్లి మరీ అధిష్ఠానానికి సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. వారు అలా ఫిర్యాదు చేసి వచ్చారో లేదో.. ఇలా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. పోతే సోము వీర్రాజు ముఖం చాటేసినా మురళీధరన్ మాత్రం రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా పలు ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చి సోముకు వ్యతిరేకంగా గళమెత్తినట్లు చెబుతున్నారు. ఏపీ బీజేపీలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభానికీ, నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తికీ సోము వీర్రాజే కారణమని మురళీధరన్ కు పలువురు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు పార్టీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదని ఆ తరువాతి పరిణామాలు స్పష్టం చేయడంతో బీజేపీ హైకమాండ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.
సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దాదాపు 200 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు రాజీనామాలకు కూడా సిద్ధపడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణలా మధ్యలో వచ్చి చేరిన వారే కాకుండా బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచీ పార్టీలో పని చేస్తున్న వారు కూడా సోము వీర్రాజు కారణంగా పార్టీ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు రాజమహేంద్రవరం సమావేశంలో పలువురు మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు. సోము వీర్రాజునే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని పలువురు ఈ సమావేశంలో స్పష్టం చేశారంటున్నారు.