కులాభిమానంతో సీఎం ప్రకటన! బీజేపీలో సోము ప్రకంపనలు
posted on Apr 1, 2021 @ 10:19AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా అభిమతమని, అర్థం వచ్చేలా సోము వీర్రాజు ప్రకటించడం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ఖంగుతినేలా చేసింది. ఇదెక్కడి ఖర్మ.. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. సోమువీర్రాజు ప్రకటన పార్టీని, అవమానించే విధంగా ఉందని, పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందన్న బాధ, అగ్రహం కమలం పార్టీ కార్యకర్తలు వ్యక్త పరుస్తున్నారు. అంతే కాదు వీర్రాజు ప్రకటన వెనక కులాభిమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే ఆరోపణలు కూడా పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
గతంలో సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో కమల దళం చెలిమి కొనసాగింది. చంద్రబాబు నాయుడు విశ్వసనీయ మిత్రుడని, పార్టీ నాయకత్వం భావించింది. రాష్ట్ర నాయకులు వద్దన్నా వినకుండా కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలున్నాయి. అంతే కాదు చివరకు, 2004లో అలిపిరి సంఘటన నేపధ్యంలో చంద్రబాబు కోరిక మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడింది. కేంద్రంలో అధికారం కోల్పోయింది. అయినా, మళ్ళీ 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. మళ్ళీ ఏమి జరిగిందో వేరే చెప్పనక్కర లేదు. చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి ధర్మపోరాటం పేరిట బీజేపీ వ్యతిరేక శక్తులను చేరదీసి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటం చేశారు.అయితే, ఆయన తను తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారు, అందుకు ఆయనే ఎక్కువ మూల్యం చెల్లించారు అనుకోండి అది వేరే విషయం. అయినా, తెలుగు దేశంతో అంచెలవారిగా సాగిన స్నేహ ‘బంధం’ వలన బీజేపీ ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు మిగిలిపోయింది.అదలా ఉంటే, తెలుగు దేశం పార్టీతో పొత్తుకు ఒక సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకులే కారణమని, అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా చాలామంది అభిప్రాయంగా వుంది.
ఇక చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గొప్ప విజ్ఞత వివేచనగల నాయకుడు కాదు. కేవలం ఏడేళ్ళ కాలంలో ఆయన అన్ని పార్టీలను చుట్టి వచ్చారు. బీజేపీ, టీడీపీతో చేతులు చేశారు, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి నడిచారు, మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. అందరితో తెగతెంపులు చేసుకున్నారు. మళ్ళీ మొదటికి వచ్చారు. బీజేపీతో చేతులు కలిపారు, తెలంగాణలో తెగతెంపులు చేసుకున్నారు. ఏపీలో తుమ్మితే ఊడే ముక్కు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో సోము వీర్రాజు అంత పెద్ద ప్రకటన చేయడం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని అంటున్నారు.
పార్టీ ఎదుగుదలకు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా మిత్ర పక్షాలకు, మిత్ర పక్షాల నాయకులకు విలువ ఇస్తోందని, బీహార్’లో జనతా దళ్’ కంటే, బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినా ముందు మాటిచ్చిన మేరకు నితీష్ కుమార్’ కు ముఖ్యమంత్రిని చేసిందని, సోము అనుకూల వర్గం గుర్తు చేస్తోంది. అలాగే, తెలుగు దేశం పార్టీతో కూడా బీజేపీ తెగతెంపులు చేసుకోలేదని, అలాగే, శివసేన, అకాలీ దళ్ విషయంలో కూడా, బీజీపీ మిత్రులను తనంతట తానుగా వదులుకోలేదని,అదే విధంగా పవన్ కళ్యాణ్ విషయంలోనూ బీజేపీ అధినాయకత్వం ఆయనకు విలువ ఇస్తోందని, అదే విషయాన్ని సోము వీర్రాజు చెప్పారని అంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాలు , ఇతర పార్టీల అనుభవాలకు, తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఉన్న చేదు అనుభవాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని మరో వాదన వినిపిస్తోంది.
మరోవైపు సోము వీర్రాజు ప్రకటన, ఆశించిన ఫలితాలను ఇవ్వక పోగా.. పార్టీని నవ్వులపాలు చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు విషయం ఎలా ఉన్నా, డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదని.. ఇందుకు, వీర్రాజు ప్రకటన కూడా ఒక కారణంగా పార్టీ వర్గాల్లో సాగుతున్న తాజా చర్చల సారాంశం.