ఇట్ ఈజ్ అఫీషియల్ నౌ.. పలాశ్ తో స్మృతి మంధానా వివాహం రద్దు

మ్యుజీషియన్ పలాశ్ ముశ్చల్ తో మహిళా క్రికెటర్ స్మృతి మంధానా వివాహం రద్దైంది. ఈ విషయాన్ని స్మృతి మంధానా స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. పలాశ్ తో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. 

ముందుగా నిర్ణయించిన మేరకు గత నెల 23న మంధానా, పలాశ్ ల వివాహం జరగాల్సి ఉంది. అయితే మంధానా  తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడిందని ఆ రోజు ప్రకటించారు. అప్పటి నుంచీ స్మృతి మంధానా వివాహంపై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ తెర దించుతూ తాజాగా స్మృతి మంధానా తమ వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.  గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఊగాహానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పేర్కొన్న ఆమె.. తన వివాహం చుట్టూ జరిగిన చర్చ తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ఈ విషయానికి ముగింపు పలకాలని ఆమె కోరారు. తమ కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇస్తూ తన వివాహం విషయంలో ఊగాహాన సభలకు ముగింపు పలకాన్నారు.  

ఇలా ఉండగా.. ఈ వివాహం నిశ్చితార్ధం తరువాత రద్దు కావడానికి పలాశ్ ముశ్చల్ వ్యవహారమే కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పలాశ్ ముచ్చల్ పెద్దగా పెద్దగా పేరు లేని మ్యూజిక్ డైరక్టర్. చాలా కాలంగా స్మృతితో ప్రేమలో ఉన్నారు.  ఈ క్రమంలోనే వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తరువాత  పలాశ్ ముశ్చల్ వ్యవహారశైలిపై పలు అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఓ డాన్స్ మాస్టర్ తో ఎఫైర్, మరో మోడల్ తో అభ్యంతరకర చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆకారణంగానే పెళ్లి రద్దు అయినట్లుగా తెలుస్తోంది.

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ విందు

  హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు. భోజనం సందర్భంగా కేటీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ కేఫ్‌ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్‌ అభినందించారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.  సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.   వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను ఇంత విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజమాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.   రామేశ్వరం కేఫ్‌లో లంచ్ కార్యక్రమం ముగిసిన అనంతరం, అఖిలేష్ యాదవ్ మరియు కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.  

హాస్టల్లో కోతుల బెడద…రక్షణ కల్పించాలని తల్లిదండ్రుల నిరసన

  అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మెరుగైన విద్య కోసం రావికమతం, మాడుగుల మండలాల పరిధిలోని ఆవురువాడ, చీమలపాడు పంచాయతీ పరిధిలో రాయపాడు, పెదగరువు, జోగంపేట, అజయ్పురం, కళ్యాణ్ లావా, చీమలపాడు, తోపాటు గొరిగడ్డ గ్రామాలకు చెందిన మొత్తం 96 మంది ఆదివాసి గిరిజన విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గత నెల రోజులుగా హాస్టల్ ప్రాంగణంలో కోతులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో, వారిని  హాస్టల్ సంక్షేమ అధికారి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై పత్రికల్లో వార్తలు రావడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. తమ పిల్లలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, జిల్లా ఉన్నతాధికారులు ఒక రాత్రైనా హాస్టల్లో బస చేసి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కోరారు. అదే విధంగా హాస్టల్‌లో కిటికీలు సక్రమంగా లేకపోవడం, చుట్టూ భారీ చెట్లు ఉండటం వల్ల కోతుల బెడద పెరిగిందని వారు తెలిపారు. వెంటనే చెట్ల తొలగింపు, కిటికీల మరమ్మతులు చేపట్టి, గిరిజన విద్యార్థులకు భద్రత కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  స్వాగతం పలికారు. రాహుల్ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్ పాల్గొంటారు. మెస్సీ రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి డొమెస్టిక్ అరైవల్స్ వద్దకు ప్రయాణికులను ఒక్కొక్కరిని అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి విజిటర్స్ అవర్స్‌ను కూడా డిస్మిస్ చేశారు.  మొదటగా లియోనెల్ మెస్సి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి ప్రైవేట్ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన దృష్టిలో ఉంచుకోని, ఉప్పల్ స్టేడియం వద్ద 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో సీసీటీవీ కెమోరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు.  

ధాన్యం కొనుగోలుపై మంత్రి పార్థసారథి తక్షణ స్పందన

  కృష్ణా జిల్లాలో కారకంపాడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, అనంతరం విజయవాడకు తిరిగి వెళ్తున్న సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ రైతులు మాట్లాడుతూ… ధాన్యం పై పొర రంగు మారిందనే కారణంతో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రికి తెలిపారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి పార్థసారథి, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యాపారస్తుల లారీలను ఆపించి విచారణ చేపట్టారు. వ్యాపారస్తులు ధాన్యం రూ.1500కి కొనుగోలు చేస్తున్నామని చెప్పినా, వాస్తవంగా రైతులకు కేవలం రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నట్టు మంత్రి పరిశీలనలో తేలింది. దీంతో రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నట్లు స్పష్టమైంది. మంత్రి ఆదేశాల మేరకు మాయిశ్చరైజర్ యంత్రాన్ని తెప్పించి ధాన్యాన్ని పరీక్షించగా, పై పొరలో రంగు మారినప్పటికీ లోపల బియ్యం నాణ్యత పూర్తిగా బాగానే ఉందని నిర్ధారణ అయింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, డీఎం సహా సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఇకపై రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి తక్షణ స్పందన, దృఢమైన నిర్ణయాలతో న్యాయం జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  

పొందూరు ఖాదికి జి.ఐ. టాగ్...రామ్మోహన్ నాయుడు హర్షం

  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రమ ఫలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ప్రపంచ ఖ్యాతి సాధించిన పొందూరు ఖాదికి మళ్ళీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే పొందూరు ఖాదికి భౌగోళిక గుర్తింపు ప్రకటిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ పరిధిలోని భోగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం నాడు అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ ప్రకటన పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చెయ్యగా… శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   అసలేంటి జి.ఐ. టాగ్..?  ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది.. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని.. వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చే విదంగా  "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం క్రింద  ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.తద్వారా మిగిలిన ఉత్పత్తుల కన్నా, మేలైనవిగా, విలువైనవిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు నిలుస్తాయి. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు.. నకిలీ వస్తువుల నుండి కాపాడబడుతుంది. విలువైనదిగా కూడా మారుతుంది.  ఇందుకోసం భోగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక దఫాలుగా క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నాణ్యతని  అన్ని దశల్లో పరీక్షిస్తుంది. ప్రజల్లో ఉన్న ఆదరణను సైతం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మన దేశంలో అనేక విలువైన, అంతరించిపోయే దశలో అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ చాలా కొద్ది వస్తువులు మాత్రమే ఈ తరహా భౌగోళిక గుర్తింపు సాధించగా.. అందులో పొందూరు ఖాదీకి జి.ఐ టాగ్ లభించడం వెనుక.. అప్పట్లో శ్రీకాకుళం ఎంపిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు విశేష కృషి చేశారు.  2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఆ సందర్భంగా పొందూరు ఖాది గురించి తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మలా సీతారామన్ తో అప్పటి శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా భేటి అయ్యారు. అప్పటికే జి.ఐ టాగ్ విలువ తెలిసిన రామ్మోహన్ నాయుడు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు  పొందూరు ఖాది ఖ్యాతిని వివరిస్తూ.. జి.ఐ. టాగ్ ను కేటాయించాలని తొలుత కోరారు. దీనికి ఆమె నుండి కూడా సానుకూల స్పందన లభించింది.  అనంతరం ఆగస్ట్ 3, 2021 పార్లమెంట్ లో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. మరోమారు జి.ఐ టాగ్ కోసం ప్రధానంగా, సుదీర్ఘంగా సభలో ప్రసగించారు. ఇక అది మొదలు అందుబాటులో ఉన్న అన్ని వేదికల్లో పొందూరు ఖాది ఖ్యాతిని వివరిస్తూ.. జి.ఐ టాగ్ కోసం యత్నించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత మరింత వేగం పెంచారు. సంబంధిత శాఖపై ఈ తరహా గుర్తింపు సంఖ్య వచ్చేందుకు చర్యలు వేగవంతం అయ్యేలా కృషి చేశారు.  తాజా శుక్రవారం నాడు అధికారికంగా పొందూరు ఖాదికి సంబంధించిన జి.ఐ టాగ్  గుర్తింపు ప్రతి అందుబాటులోకి వచ్చింది. పొందూరు ఖాదికి జి.ఐ టాగ్ నంబర్ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై కేంద్రంగా ఉన్న భోగోళిక సూచికల రిజిస్ట్రీ, ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వెలువడించింది.  ఇంతవరకు బాస్మతి బియ్యం,డార్జిలింగ్ తేయాకు, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు (2005), మైసూరు పట్టు, కొండపల్లి, నిర్మల్ బొమ్మలు,  మైసూర్ శాండల్ సబ్బు.. ఇలా  కొన్ని ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు ఉండగా.. ఇకపై పొందూరు ఖాది కూడా ఆ లిస్టులో చేరింది.  దీని ద్వారా చట్టపరమైన గుర్తింపు, పొందూరు తప్ప.. ఈ తరహా విధానంలో ఇతరులు చేసే నకిలీ ఉత్పత్తులను అరికట్టే అవకాశం ఉంది. గడచిన కొన్నేళ్లుగా తన ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఉన్న పొందూరు ఖాదికి.. జి.ఐ టాగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేసిన రామ్మోహన్ నాయుడు కు పొందూరు వాసులే కాదు.. ఉత్తరాంధ్ర ప్రాంతీయులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉన్న పొందూరు ఖద్దరుకు.. జి.ఐ. గుర్తింపు రావడంతో భవిష్యత్ లో మరింతగా కీర్తి సంపందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా  ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణమని రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న  శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయిని తెలిపారు. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దామని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.  

ఆడకుండా వెళ్లిపోయిన మెస్సీ... కోల్‌కతా ఫ్యాన్స్ వీరంగం

  భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. అర్జెంటీననా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి ఇండియాలో అడుగుపెట్టాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. ఇప్పటికే మెస్సి కోల్‌కతా చేరుకున్నాడు. కోల్‌కతా అంతా ఇప్పుడు అంతా మెస్సి జపమే చేస్తోంది. 2011 తర్వాత ఈ స్టార్ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అభిమానులంతా భారీ ఎత్తున ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. అయితే మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.  గోట్ టూర్ ఆఫ్ ఇండియాపేరుతో సాగుతున్న ఫుట్ బాట్ దిగ్గజం కోల్‌కత్తా సాల్ట్ లేక్ స్టేడియం సందర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ లేడీ ఫ్యాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  చాలా మంది వీరాభిమానులు మెస్సిన చూడటం కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్సుకతతో ఎదురుచూశారు. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో రకంగా వెల్లడించారురు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మెస్సీ కోల్ కత్తా స్టేడియంలో మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడం వివాదాస్పదమైంది.   మెస్సీని దగ్గర నుంచి చూడాలని అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురు చూశారు.  ఇలాంటి తరుణంలో అతను అలా వచ్చి, ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు.  స్టేడియంలో పట్టుమని 10 నిముషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు.  తెల్లవారుజామున కోల్‌కతాలో దిగిన మెస్సి ఉదయం 11.30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లాడు. అప్పటికే భారీస్థాయిలో అభిమానులు అక్కడకి చేరుకున్నారు. రాజకీయ నేతలు, పుట్ బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సభ్యులు ఆయన్ను చుట్టుముట్టడంతో స్టాండ్స్ నుంచి ఆ స్టార్‌ను చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్నవారిని దూరం జరిపే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవికూడా ఫలించలేదు. ఈ గందరగో పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించి రెండు ఈవెంట్లను నిర్వహించలేకపోయారు.   భద్రతాకారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతడిని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లి పోయారు. అతడు వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయి ఆగ్రహం వెళ్లగక్కారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు , ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరూ రూ.4,500 నుంచి రూ. పదివేల వరకు వెచ్చించారని తెలుస్తోంది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపారు. శనివారం కోల్‌కతాలో పర్యటించిన మెస్సీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సి ఆవిష్కరించాడు.  అయితే ఈ సందడి నడుమ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి మెస్సి  అభిమానులంతా ఆగ్రహానికి గురయ్యారు మెస్సి.. ప్రపంచ స్థాయిలో ఎంతో మంది అభిమానులు ఆయన సొంతం. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తుండటం.. ఇటీవలే ఫిఫా ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంతో మెస్సిని చూడాలని అభిమానులు తహతహలాడారు. ఆయన కోసం గంటలు గంటలుగా ఎదురు చూశారు. కానీ ఆయన ఎంతో సేపు అక్కడ లేకపోవడంతో అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆడుతానని చెప్పి ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్ అంతా నిరసన తెలిపారు. మెస్సి కోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నామని.. మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేడియంలో కుర్చీలు విరగ్గగొట్టారు. కోల్‌కతా స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.  నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, స్టేడియంలో మెస్సీ అభిమానులు గందరగోళం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

మేస్త్రీ- మెస్సీ...టూర్ ఆఫ్ హైద‌రాబాద్

  ప్ర‌పంచ ఫుట్ బాల్ లెజండ్, అర్జెంటీనా స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ 14 ఏళ్త త‌ర్వాత తిరిగి భార‌త్ వ‌చ్చారు. 2011లో కోల్ క‌తాలో జ‌రిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ త‌ర్వాత మెస్సీ ఇండియా రావ‌డం ఇది సెకండ్ టైం. GOAT ఇండియా టూర్ పేరుతో మూడు రోజుల పాటు ఆయన భారతదేశంలో ప‌ర్య‌టిస్తారు.ఈ టూర్ లో మెస్సీ మొద‌ట కోల్ క‌త‌, త‌ర్వాత హైద‌రాబాద్, ఆ త‌ర్వాత ముంబై, ఢిల్లీ  సంద‌ర్శిస్తారు. ఈ టూర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే దేశంలో ఫుట్ బాల్ ని ప్రోత్స‌హించ‌డం. ఆపై చారిటీ, క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయ‌డం. కోల్ క‌తాలో శ‌నివారం ఉద‌యం సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అటు త‌ర్వాత బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, న‌టుడు షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గ‌జం సౌర‌వ్ గంగూలీ  వంటి  వారిని  క‌లుస్తారు. అలాగే  శ్రీ  భూమి స్పోర్టింగ్ క్ల‌బ్ లో త‌న 70 అడుగుల విగ్ర‌హాన్ని  వ‌ర్చువ‌ల్ గా ప్రారంభిస్తారు మెస్సీ. ఇక శ‌నివారం సాయంత్రం మెస్సీ హైద‌రాబాద్ వ‌స్తారు. ఇక్క‌డ సీఎం రేవంత్ రెడ్డితో క‌ల‌సి ఉప్ప‌ల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతారు.. ఆ త‌ర్వాత మెస్సీ గౌర‌వార్దం సంగీత క‌చేరీ.. ప్రీమియం మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేస్తారు. ప్ర‌త్యేకంగా  ఫ‌ల‌క్ నుమా  ప్యాలెస్ లో ఫోటో సెష‌న్లో పాల్గొంటారు మెస్సీ. ఒక్కో ఫోటో కోసం ప‌ది ల‌క్ష‌ల  మేర వ‌సూలు చేస్తారు.  ఆల్రెడీ మెస్సీతో ఫుట్ బాల్ ఆడ్డానికి మేస్త్రీ రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. ప్ర‌స్తుతం నెట్టింట రేవంత్ ఫుట్ బాల్ ఆడిన వీడియులు తెగ వైర‌ల్ అవుతున్నాయి. బేసిగ్గా  ఫుట్ బాల్ అంటే ఎంతో మ‌క్కువ గ‌ల రేవంత్ కి తెలంగాణ‌లో క్రీడాభివృద్ధిపై ప్ర‌త్యేక‌మైన ఆలోచ‌న‌లున్నాయి. ఇది వ‌ర‌కే క‌పిల్ వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌తో క‌లిసి.. తెలంగాణ‌లో క్రీడాభివృద్ధికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా మెస్సీతో క‌ల‌సి ఆయ‌న  ఫుట్ బాల్ ఆడి.. ఇక్క‌డ ఈ ఆట‌కు విశేష‌మైన ఆద‌ర‌ణ వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  మొన్న‌టి గ్లోబ‌ల్ స‌మ్మిట్ లోనూ వివిధ‌ క్రీడారంగాల‌కు సంబంధించిన ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి వారి ద్వారా  క్రీడా చ‌ర్చ‌లు జ‌రిగేలా చేశారు. 140 కోట్ల మంది భార‌తీయుల‌కు ఒలింపిక్స్ లో బొటాబొటీగా మెడ‌ల్స్ వ‌స్తున్నాయ్. ఈ సంఖ్య‌ను పెంచ‌డానికి మ‌న వంతు కృషి చేయాల‌న్న‌దే సీఎం రేవంత్ ఆలోచ‌న‌. ఈ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఇక్క‌డ మెస్సీ టూర్ ప్లాన్ చేశారు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఆదివారం నాడు ముంబైలో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎం.ఎస్. ధోనీ, శుభ్‌మన్ గిల్ వంటి క్రికెటర్లు, నటి కరీనా కపూర్, నటుడు జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో సమావేశమవుతారు మెస్సీ. సోమవారం ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు మెస్సీ.మెస్సీ, మేస్త్రీ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మ్యాచ్‌కి ముందు ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో భాగంగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ హైదరాబాద్ రాప్ సింగర్ కేడన్ శర్మ పాల్గొంటారు.  పాటలు, డ్యాన్స్‌లతో హైదరాబాద్ లైఫ్ స్టైల్లో భాగ‌మైన‌, బిర్యానీ, ఇరానీ చాయ్ గొప్పదనాన్ని వివరిస్తారు. తెలుగు సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెబుతారు. ఎందుకంటే హైద‌రాబాద్ అంటేనే బిర్యానీ- బాల్ బాడ్మింట‌న్- బాహుబ‌లి అంటూ మోడీ లాంటి వారే  కామెంట్లు చేసిన విష‌యం  తెలిసిందే. ఇక కేడన్ శర్మ మాట్లాడుతూ.. గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇవ్వబోతున్న తొలి భారతీయ హిప్-హాప్ ఆర్టిస్ట్‌గా తాను రికార్డు సృష్టించడం  గ‌ర్వంగా ఉందన్నారాయ‌న‌. తాను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడిన‌ని.. అందుకే త‌న‌ ప్రదర్శనలు పక్కా లోకల్‌గా, స్ట్రీట్ బేస్‌డ్‌గా ఉంటాయని అన్నారు.  నేను సాయి పల్లవి, అల్లు అర్జున్ గురించి మాట్లాడతాను, సల్మాన్ ఖాన్ గురించి కాదు. తెలుగు సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లాయని అన్నారు. త‌న‌ పర్ఫామెన్స్‌లో మెస్సీకి పుష్ప ఫేమస్ డైలాగ్ వినిపిస్తానని అన్నారు. ఏది ఏమైనా వ‌ర‌ల్డ్స్ ఫుట్ బాల్ లెజండ్ మెస్సీ రాక‌తో ఇక్క‌డి ఫుట్ బాల్ ల‌వ‌ర్స్ ఎంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మేస్త్రీ రేవంత్ ఎప్పుడెప్పుడు మెస్సీతో క‌ల‌సి కాలు కాలు క‌దుపుతామా అన్న ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టును ఆశ్రయించిన గవాస్కర్

  భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సునీల్ గావస్కర్, వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచారు.  టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై తన పేరు, ఫొటోలు అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ లిటిల్ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ కోర్టు విచారణ జరిపి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గావస్కర్ దావాను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, హక్కులు ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా సంస్థలు వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని సూచించింది.  ఆన్‌లైన్‌లో అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు కోరే వ్యక్తులు, ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని, ఆ తర్వాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల బేసిక్ సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ , ఐపీ వివరాలను అందిస్తామని మధ్యవర్తులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రతివాదులు 7, 10, 11గా ఉన్న మధ్యవర్తులు గావస్కర్ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. హక్కులు ఉల్లంఘిస్తున్న కంటెంట్‌కు సంబంధించిన స్పష్టమైన యూఆర్‌ఎల్‌లను 48 గంటల్లో కోర్టులో హాజరైన న్యాయవాది ద్వారా సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది. సినిమా రంగానికే పరిమితమైన ఇటువంటి వివాదాలు ఇప్పుడు క్రీడా రంగానికీ విస్తరించాయన్నది ఈ కేసుతో స్పష్టమైంది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, నాగార్జున, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, డిజిటల్ క్రియేటర్ రాజ్ శమానీ వంటి ప్రముఖులకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్‌, ఏఐ సృష్టించిన తప్పుడు వీడియోలు, అనధికార డిజిటల్ మెర్చండైజ్ వంటి కొత్త తరహా ముప్పులపై కూడా న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వ్యంగ్యం, కళాత్మక వ్యక్తీకరణ, వార్తా కథనాలు, వ్యాఖ్యానాల వంటి రంగాలపై ఈ పరిరక్షణ ప్రభావం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.  

పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం

  ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం ఎదురైంది. తుర్కిమెనిస్థాన్‌లో జరిగిన మీటింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ షరీఫ్‌ను అస్సలు పట్టించుకోలేదు.  పుతిన్, ఎర్డోగాన్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్లారు. ఓ రూములో పుతిన్, ఎర్డోగాన్‌లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు.  వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అక్కడ షరీఫ్ లేరు. వేరే రూములో పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పుతిన్, ఎర్డోగాన్‌ల మధ్య మీటింగ్ మొదలై 40 నిమిషాలు పైనే గడిచింది. అయినా షరీఫ్‌కు పిలుపురాలేదు. దీంతో అసహనానికి గురైన షరీఫ్... పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. రూములోకి ప్రవేశించి సోఫాలో కూర్చున్నారు.  అయితే, పుతిన్ కానీ, ఎర్డోగాన్ కానీ షరీఫ్‌ను పట్టించుకోలేదు. వారి మానాన వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచాయి. అయినా ఆయనను ఎవ్వరూ పలకరించను కూడా లేదు. దీంతో షరీఫ్ కోపం కట్టలు తెంచుకుంది. అక్కడినుంచి గబగబా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇక, ఈ సంఘటనపై ఆర్టీ ఇండియా స్పందిస్తూ... ‘ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు’ అని వెల్లడించింది.  రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రధాని మోడీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. రెండు రోజుల పాటు సందడి సందడిగా గడిపారు. పర్యటన సందర్భంగా ఇద్దరూ చాలా సార్లు ప్రోటోకాల్స్‌ను బ్రేక్ చేశారు.  

తెలంగాణలో చలి పంజా...పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్ధాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం అత్యల్పంగా  సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది.  గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. దీంతో గత పదేళ్ల రికార్డు (డిసెంబరు 12న ఇంత తక్కువ నమోదు కావడం) బద్దలైంది. దీంతోపాటు డిసెంబరు రెండోవారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని.. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణశాఖ తెలిపింది.  హైదరాబాద్‌లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్‌లో 5.6 డిగ్రీలు, మెదక్‌లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి.రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.