తెలంగాణలో పరిశ్రమలకు సింగిల్ విండో!
posted on Jul 23, 2014 @ 10:14AM
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు విషయంలో సింగిల్ విండో విధానాన్ని అమలు చేసే ఆలోచనలో వుంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి వివరించారు. తమ ప్రభుత్వం అనుసరించే కొత్త పారిశ్రామిక విధానం వల్ల ఉద్యోగాలతోపాటు ఉత్పత్తి కూడా పెరుగుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే పారిశ్రామికవేత్తలు తనను నేరుగా సంప్రదించవచ్చని కేసీఆర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో రెండున్నర లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామని, దరఖాస్తు చేసుకున్న 12 నుంచి 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. దీనికోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నామని చెప్పారు.