పంజాబ్ కాంగ్రెస్’లో సీఎం వర్సెస్ సిద్దూ ఓపెన్ వార్
posted on May 24, 2021 @ 11:20AM
పంజాబ్ శాసన సభ ఎన్నికల గడవు దగ్గర పడుతోంది. మరో ఆరేడు నెలల్లో ఎన్నికల జరుగుతాయి. అయితే, ఇలాంటి కీలక సమయంలో, రాష్ట్రంలో అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మధ్య, ఎంతో కాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇంకా అంతో ఇంతో పట్టు, పలుకుబడి మిగిలి ఉన్న మూడు నాలుగు రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రత్యర్ధి పార్టీలకు గట్టిపోటీ ఇవ్వలేక పోయింది. అస్సాం, కేరళల రాష్ట్రాలలో దక్కుతుందనుకున్నఅధికారం చిక్కకుండా పోయింది. పుదుచ్చేరిలో అధికారం చేజారి పోయింది. బెంగాల్’ లో ఘోరంగా ఒక్క సీటూ దక్కలేదు. తమిళనాడులో, మిత్ర పక్షం, డిఎంకే పుణ్యాన హస్తం పార్టీకి అబోరు దక్కింది. మొత్తానికి ఓ 18 సీట్లు గెలుచుకుంది. ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చాలా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మపరిశీలన చేసుకోవాలని, మందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలని పార్టీ నాయకులకు ఉద్బోదించారు.
అయితే, ఆమె చేసిన ఉద్భోద ఏమైందో ఏమో కానీ,వచ్చే సంవత్సరం ఆరంభంలో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల శాసన సభల ఎన్నికలతో పాటుగా ఎన్నికలు జరిగే పంజాబ్’లో మాత్రం, ‘కాంగ్రెస్ కల్చర్’లో ఏ మాత్రం మార్పు రాలేదు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీమంత్రి నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య వివాదం రోజు రోజుకు ముదిరి మరింత పాకాన పడుతోంది.నిజానికి కెప్టెన్ సింగ్, సిద్దూ మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పుడు ఇద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయానికి ఇది ఎటువైపు దారి తీస్తుందనేది, కాంగ్రెస్ అధిష్టానికి కూడా మింగుడు పడని సమస్యగా మారింది. అదలా ఉంటే, సిద్దూ అదలా ఉంటే, 2015లో ఫరిద్‌కోట్‌లోని కొట్కాపుర్‌లో గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశారని నిరసన తెలిపిన ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని సిద్దూ గురు గ్రంథ్ సాహిబ్ కోసం ప్రాణత్యాగం చేసిన వారికీ న్యాయజరగాలన్న డిమాండ్’తో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. ఆలా ప్రారంభమైన వివాదం, ఒక విధంగా చిలికి చిలికి పార్టీలో చీలికకు దారి తీసే పరిస్థితులను సృష్టించింది. ఎమ్మెల్ల్యేలు ముఖ్యమంత్రి వర్గం, సిద్దూ వర్గంగా చీలిపోయారు. ఈ నేపధ్యంలో కొట్కాపుర్ కాల్పుల కేసులో హైకోర్టు పోలీసులకు అనుకుఅలంగా వచ్చింది. ఈ తీర్పుతో సిద్ధూ అనుకూలవర్గం ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలకు దిగారు. ఈ అంశాన్ని ప్రధానంగా చూపుతూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు సిద్ధూ. దోషులను శిక్షించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అందుకే ఉద్దేస పూర్వకంగా కేసు వీగిపోఎలా చేసారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం, ఎమ్మెల్యేలతో భేటీల్లో.. ఈ అంశాన్ని నేతలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనలో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని ఆరోపించారు. ఈ అంశంపై పీసీసీ చీఫ్ సునీల్ జఖర్ రాజీనామా చేస్తానని తెలపగా.. దానిని సీఎం తిరస్కరించారు. ప్రస్తుతం సీఎంపై విమర్శలను విస్తృతం చేశారు సిద్ధూ. దీంతో పార్టీ సంక్షోభంలోకి కూరుకుపోతోందని, చేయి దాటకముందే పార్టీ హైకమాండ్ కలుగజేసుకోవాలని పలువురు నేతలు కోరుతున్నారు.
అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఇద్దరు అగ్ర నేతల మధ్య గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే విబేధాలు మొదలయ్యాయి. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ అమృత్‌సర్ తూర్పు స్థానం నుంచి గెలిచారు తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కింది. 2018లో పాకిస్థాన్ పర్యటన చేపట్టి ఆ దేశ ఆర్మీ అధినేత కమార్ జావేద్ బజ్వాను కౌగిలించుకొని.. అత్యంత సన్నిహతంగా కనిపించటంపై కెప్టెన్ అమరీందర్ నేరుగానే సిద్దూపై విమర్శలు గుప్పించారు. ఆ వివాదం అలా కొనసాగుతున్న సమయంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దూ భార్య, సిట్టింగ్ ఎంపీ నవజోత్ కౌర్ సిద్ధూకు టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో.. 2019 జులైల సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అయినా ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితులే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పడు ఇలా బయట పడ్డాయి. చివరకు వ్యక్తిగత విమర్శలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళ వరకు వెళ్ళింది. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా నుంచి పోటీ చేయాలని, సిద్దూకు సింగ్ సవాల్ విసిరారు. సిద్ధూకు కనీస డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో చేరాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు.. సునీల్ జఖర్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించే అంశాన్ని తోసిపుచ్చారు. సిద్ధూకు ఉన్నత పదవి ఇవ్వాలన్న అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వాదనలనూ తోసిపుచ్చారు. అంతే కాదు, సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇలా ఇద్దరి మధ్య సాగుతున్న వివాదం చివరకు ఎందాక పోతుందో .. ఎక్కడ తేలుతుందో .. ప్రస్తుతానికి అయితే ఊహకు అందని విషయంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ హై కమాండ్ ముందెన్నడూ లేనంత బలహీనంగా ఉండడం వల్లనే పరిస్థితి చేయి దాటిపోయే వరకు వచ్చిందని పార్టీ నాయకులే అంటున్నారు.