సిద్ధం సభ అట్టర్ ప్లాప్!.. గెలుపు ఆశలు ఉఫ్!
posted on Mar 11, 2024 8:58AM
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయింది. సభకు జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. బస్సులు ఏర్పాటు చేసి తాగడానికి మందు బాటిల్స్, తినడానికి బిర్యానీ పొట్లాలు ఇస్తామన్నా సభకు వచ్చేందుకు ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో అరకొరగా వచ్చిన ప్రజలతో సిద్ధం సభా ప్రాంగణం ఖాళీగా కనిపించింది. కొన్ని ప్రాంతాల నుంచి అయితే.. కేవలం నలుగుతోనే బస్సులు సభకు వెళ్లడంచూస్తే సిద్ధం సభ ఏ స్థాయిలో ఫెయిలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సభకు ముందు వరకు భారీ సంఖ్యలో ప్రజలు సభకు వస్తారని వైసీపీ నేతలు భావించారు. విజయసాయి రెడ్డిలాంటి నేతలైతే సిద్ధం సభకు 15లక్షల మంది హాజరువుతారు. ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు వస్తున్నారంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, చివరికి గట్టిగా లెక్కిస్తే.. లక్షన్నర రెండులక్షల మంది కూడా సభకు హాజరు కాని పరిస్థితి. భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరవుతారు. తన ప్రసంగంతో వారిలో జోష్ నింపుదామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్సాహంగా సభకు హాజరయ్యారు.. కానీ, సభలో జనాన్నిచూసి జగన్‌లో సైతం నీరసం వచ్చేసినట్లుంది. ఈ సభకు హాజరైన జనాలే రానున్న ఎన్నికలలో పార్టీ ఫేట్ ఏమిటన్నది తేల్చేసినట్లైంది. అంతకుముందే రాసిన స్క్రిప్ట్ తెచ్చుకొని చదువుతూ.. నిమిషానికోసారి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. మధ్యమధ్యలో పవన్, బీజేపీపై విమర్శలు చేస్తూ జగన్ మరో సారి ఆవుకథ లాంటి ప్రసంగాన్ని మమ అనిపించేశారు. సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవటంతో స్థానిక నేతలపై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. సభకు జనాన్ని ఎందుకు తరలించలేకపోయారు అంటూ నేతలపై జగన్ మండిపడ్డారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ ఆధ్వర్యంలో గతంలో మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు జరిగాయి.. నాలుగో సిద్ధం సభను బాపట్ల జిల్లాలో నిర్వహించారు. ఇదే చివరి సిద్ధం సభ కావడంతో ఈ సభా వేదిక నుంచి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించాలని తొలుత జగన్మోహన్ రెడ్డి భావించారు. సభకు తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో మ్యానిఫెస్టోను పక్కన పెట్టేసినట్లు వైసీపీ వర్గాల సమాచారం. తెలుగుదేశం, జనసేన కేటమితో బీజేపీ కలవడం ఖాయమైన తరువాత, పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా ఎలాంటి ఇబ్బందులూ, పొరపొచ్చాలే లేకుండా పూర్తయిన తరువాత జరుగుతున్న సిద్ధం సభ కావడంతో.. జగన్ మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారన్న ఉత్సుకత ఏపీ ప్రజల్లో కనిపించింది. కానీ, జగన్ మాత్రం.. ఎప్పటిలానే చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేయడానికే తన ప్రసంగాన్ని పరిమితం చేశారు. బీజేపీని, ఆ పార్టీ నేతలకు విమర్శించేందుకు జగన్ ధైర్యం చేయలేక పోయారు. కే వలం బీజేపీకి గత ఎన్నికల్లో డిపాజిట్లుకూడా రాలేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందంటూ జగన్ మాటవరసకు చెప్పారు. అంతే మిగిలిన ప్రసంగం అంతా గతంలో ఆయన ప్రసంగాలకు సేమ్ టూ సేమ్. ప్రతీసభలో చెప్పినట్లుగానే.. వచ్చే ఎన్నికలు ధర్మానికి.. అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. తాను ఒంటరినీ, మిగిలిన వారంతా ఒకటయ్యారంటూ అంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు జగన్. మొత్తానికి జగన్ తన ప్రసంగంలో ప్రారంభం నుంచి చివరి దాకా.. చంద్రబాబు జపమే చేశారు. ఎప్పుడూ చెప్పే మాటలే, చేసే విమర్శలే చేసిన జగన్.. తాను మళ్లీ గెలిస్తే ఏం చేస్తాననే మాట తన నోటి వెంట రానీయలేదు.
సిద్ధం సభలో డ్రోన్ కొద్ది సేపు కలకలం సృష్టించింది. సభకు ప్రజలు రాకుంటే గ్రాఫిక్స్ మాయాజాలంతో భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యారని చూపించడానికి ముందుగానే వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసింది. మైదానం మొత్తం గ్రీన్ మ్యాట్ లు వేసింది. దీని ద్వారా గ్రాఫిక్స్ తో మైదానం మొత్తం ప్రజలతో నిండిపోయినట్లు చూపించేందుకు ప్రయత్నించింది. అయితే, సభ జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని డ్రోన్ ఒకటి సభా ప్రదేశంలో ఎగురుతూ కనిపించింది. దీంతో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని వైసీపీ నేతలు ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఆ డ్రోన్ ను తొలగించారు. అయితే, డ్రోన్ తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ డ్రోన్ దృశ్యాల్లో సభాప్రాంగణం సగానికి కూడా నిండలేదని విస్పష్టంగా చూపాయి. మొత్తానికి గత మూడు సిద్ధం సభలకూ ఎదో విధంగా జనాన్ని తరలించగలిగినా, నాలుగో, చివరి సిద్ధం సభకు మాత్రం ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం రాలేదు. దీంతో జగన్ లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. వైసీపీ నేతలు డీలా పడిపోయారు. అధికారంలో ఉండి కూడా సభకు జనాన్ని ఎందుకు తరలించలేకయిన పరిస్థితి జనంలో జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సాహసంకూడా చేయలేక పోతున్నారు. ఈ క్రమంలో టీడీపీ- జనసేన కూటమిగా ఏర్పడటంతో వైసీపీ ఓడిపోతుందన్న భావనకు మెజార్టీ ప్రజలు వచ్చేశారు. తాజాగా టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీకూడా కలిసిపోవటంతో జగన్ తో పాటు, వైసీపీ నేతల్లో భయం పట్టుకుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, అమిత్ షాలపై విమర్శలు చేయకుంటే వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని, అలాఅని మోదీ, అమిత్‌షాపై విమర్శలు చేస్తే.. కేంద్రంలో ఎలాగూ బీజేపీ మరోసారి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి.. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది.. దీంతో అధికారం కోల్పోయిన తరువాత ఎక్కడ జైళ్లో వేస్తారోనన్న భయం జగన్ ను వెంటాడుతుందట. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖాయం కావడంతో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.