నిజ జీవితానికి దూరంగా బాలీవుడ్: సిద్దార్థ్
posted on Mar 28, 2013 @ 1:58PM
టాలివుడ్ లవర్ బాయ్ సిద్దార్థ్ సినీ పరిశ్రమ గురించి చాల నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెపుతుంటాడు. అందుకు చిత్ర నిర్మాణానికి సంబంధించి వివిధ శాఖలపై అతనికున్న పట్టు ఒక కారణం కాగా, కేవలం తెలుగు సినిమాలకే పరిమితమయిపోకుండా, తమిళ్, హిందీ సినిమాలు కూడా చేస్తుండటం వలన ఇతర చిత్ర పరిశ్రమల గురించి కూడా మంచి అవగాహన కలిగి ఉండటం రెండో కారణం.
త్వరలో అతను నటించిన హిందీ సినిమా ‘చస్మే బద్దూర్’ విడుదల కానున్న సందర్భంగా బాలివుడ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక మాయ ప్రపంచం సృష్టించి అందులో వారిని విహరింపజేస్తున్నాయి. నిజ జీవితానికి ఏమాత్రం దగ్గరలేనప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాలు చూసి ఆనందిస్తున్నారంటే దానికి కారణం వారి దైనందిన జీవితాలలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళ నుంచి బయట పడటానికేనని చెప్పవచ్చును. బాలివుడ్ ఒక కొత్త సినిమా నిర్మించడానికి మరి కొన్ని ఇతర సినిమాలపై ఆధారపడితే, దక్షిణాది చిత్రసీమ మాత్రం తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ, వాటినుండి కధలను అల్లుకొంటుంది. దక్షిణాదిన సినీ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటే, బాలివుడ్ లో సినిమా ప్రచారం చేసుకోవడంలో నేర్పు కనబరుస్తారు. ఈ విషయంలో దక్షిణాది సినీ పరిశ్రమ బాలివుడ్ నుంచి చాల నేర్చుకోవలసి ఉంది.”
“ అయితే, దక్షిణాదిన తయారవుతున్న మాస్ మసాల కమర్షియల్ సినిమాలను హిందీలోకి రిమేక్ చేసుకొంటున్న బాలివుడ్ ఎన్నడూ కూడా దక్షిణాది పరిశ్రమకు కృతజ్ఞతలు చెప్పలేదు సరికదా అది తన హక్కు అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఏమయినప్పటికీ, ఉత్తర దక్షిణ సినీ పరిశ్రమలు చేతులు కలిపి ముందుకు సాగితే అది యావత్ భారత చిత్ర పరిశ్రమకు మేలు చేస్తుంది. నాకు బాలివుడ్ లో నటించడం కేవలం హాబీ మాత్రమే, కానీ దక్షిణాది సినిమాలలో నటించడం మాత్రం నా వృత్తిగా భావిస్తాను. అందుకే, నేను బాలివుడ్ కంటే దక్షిణాది సినిమాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను,” అని సిద్దార్థ్ అన్నాడు.