అసెంబ్లీ ప్రసంగిస్తుండగా జారిన పంచె... మాజీ సీఎంకు చెవిలో చెప్పిన సీనియర్ నేత..
posted on Sep 24, 2021 8:46AM
కర్ణాటక అసెంబ్లీలో నవ్వులు పూయించే ఘటన జరిగింది. మైసూరులో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచార ఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యనేత సిద్ధరామయ్య సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. అంతలోనే కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఆయన వద్దకు వచ్చి చెవిలో ఏదో చెప్పారు. దీంతో ‘అవునా’ అంటూ సిద్ధరామయ్య వెంటనే కుర్చీలో కూర్చున్నారు.
సిద్ధరామయ్య చెవిలో డీకే శివకుమార్ ఏదో చెప్పడం... ఆయన వెంటనే ప్రసంగాన్ని ఆపేసి కుర్చిలో కూర్చోవడంతో అసెంబ్లీలోని సభ్యులంతా షాకయ్యారు. సిద్ధరామయ్య చెవిలో డీకే ఏం చెప్పారు?
ఆయన ఎందుకు కూర్చున్నారన్నది ఎవరికీ అర్ధం కాలేదు. అయితే డీకే సిద్ధరామయ్యకు చెప్పింది.. ఆయన పంచె జారిపోతుందని. సరిగా కట్టుకోవాలని సూచించడంతో వెంటనే కుర్చిలో కూర్చున్నారు సిద్ధరామయ్య. కుర్చీలో కూర్చుంటూ పంచె సరిగా కట్టుకున్న తర్వాత మాట్లాడతానని సభకు చెప్పడంతో అందరూ చిరునవ్వులు చిందించారు.
సిద్ధరామయ్య ఆ మాట అనగానే స్పీకర్ స్థానంలో ఉన్న కుమార్ బంగారప్ప స్పందిస్తూ.. ‘‘సమస్య ఏంటో మీరే చెబితే వినడానికి బాగుంటుంది’’ అన్నారు. ఆ తర్వాత ధోతీ బిగించి కట్టుకున్న సిద్ధరామయ్య లేచి మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగైదు కిలోల బరువు పెరిగానని, దీంతో పొట్టపరిమాణం పెరగడంతో పంచె జారిపోతోందని చమత్కారంగా చెప్పారు. అసెంబ్లీలోని ట్రెజరీ వైపు నుంచి సాయానికి ఒకరు ముందుకు రాగా, మీరు అవతలి వైపు పార్టీ వారు కనుక సాయం తీసుకోబోనని చెప్పారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ సభలో మరిన్ని నవ్వులు పూయించారు. సిద్ధరామయ్య పంచె ఊడిపోతోందన్న విషయం గుర్తించిన తమ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ఆయన పరువును, పార్టీ పరువును కాపాడేందుకు నెమ్మదిగా చెవిలో చెబితే ఆయనేమో (సిద్దరామయ్య) ఆ విషయాన్ని సభలో బయటపెట్టేశారని చెప్పడంతో సభ్యులందరూ ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇప్పుడీ విషయాన్ని బీజేపీ తమను ఇరుకున పెట్టేందుకు వాడుకుంటుందని చెప్పడంతో సభలో మరోమారు నవ్వులు విరిశాయి.