మూడు నెలల వ్యవధి కావాలన్న సర్కారు వాదనను తిరస్కరించిన ఏపీ హైకోర్టు
posted on Apr 16, 2020 @ 9:34PM
* పార్టీ రంగుల తొలగింపు కేసులో మరోసారి చుక్కెదురు!
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో మారు షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మూడు నెలల గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేసేందుకు ఎంత సమయం పడుతుందో సోమవారం రోజున చెబుతామని న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.
పంచాయతీరాజ్ శాఖ అధికారులు గత ఏడాది ఆగస్టులో జారీ చేసిన మెమోను లోగడ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని రంగుల కోసం మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్‌ని ఆదేశించింది. పది రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంతకుముందే నిర్దేశించింది. దాంతో అధికారంలో ఉన్న పార్టీల రంగులను ప్రభుత్వ భవనాలకు వేయడం వల్ల.. ఇప్పుడు వాటిని మార్చాల్సి వస్తోందని.. ఫలితంగా ప్రజాధానం వృధా అవుతోందని ప్రతిపక్షాలతో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 17,367 గ్రామాలుండగా, 12,918 గ్రామపంచాయతీలు ఉన్నాయి. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కలిపి మరో 195 ఉన్నాయి. వాటిని ప్రతి 2,000 జనాభాకు ఒకటి చొప్పున విభజించి 11,114 గ్రామ సచివాలయాలు, 3,775 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు, గ్రామ సచివాలయాల కోసం వివిధ ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో కూడా ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ కార్యాలయాలతో పాటుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయాలన్నింటికీ మూడు రంగులను వేయించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు 2019 ఆగస్టు 11న మెమో రూపంలో ఉత్తర్వులు ఇచ్చారు. అవి కూడా అధికార పార్టీ రంగులు కావడంతో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో కూడా నాటి అధికార పార్టీ టీడీపీ జెండా రంగులను అనేక చోట్ల ప్రభుత్వ భవనాలకు వేయించారు. అన్న క్యాంటీన్ల వంటివి స్పష్టంగా కనిపించాయి.