ఇక హిట్లర్‌లా గ్యాస్‌ఛాంబర్లే తక్కువ!
posted on Jun 17, 2022 @ 1:53PM
అధికారం చేతిలో వుంటే ఏదయినా చేయవచ్చు, ఏది చేసినా ఫరవా ఇల్లే అనుకునే తత్వం ఎంతవరకు మంచిది అనేది ఆ మనుషులను అనుసరించి వుంటుంది. అధికారంలోకి రాగానే ఇతరుల మీద దాదాగిరీ చేయవచ్చన్న నమ్మకం దాన్ని మనస్పూర్తిగా అమలుచేయడం అనేది కేవలం బిజెపీ వారికే చెల్లింది! ప్రస్తుతం కేంద్రంలో బిజెపీ పాలనావిధానం, అమలు చేస్తున్న వారి ఆలోచనా పంథా గమనిస్తే అసలు దేశంలో విపక్షం అనేది లేకుండా చేసుకుందామన్న ఆతృత బాగా కనపడుతోంది. దేశంలో అసలు విపక్షా లను పూర్తిగా తొలగించడానికి పూర్వం హిట్లర్ వలె ప్రాణాంతక గ్యాస్‌ఛాంబర్‌లను ఏర్పాటు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల విపక్షాలను అణగదొక్కే ప్రయత్నాలే చేస్తున్నదని శివసేన పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో ఘాటుగా విమర్శించింది.
అందుకు వీలుగా కాంగ్రెస్‌నే కాదు తమ పాలన లేని రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల వారి మీద కూడా చట్టాన్ని, ఇ.డీ, పోలీసు వ్యవస్థ లను దాడికి వినియోగించుకుంటోందన్న ఆరోపణలు బాగా వినపడుతున్నాయి. ఇందుకు తాజా సాక్ష్యం కాంగ్రెస్ అధనేత సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉసిగొల్పడం! అసలు బీజేపీ ఈ విధమయిన పాలనాతీరు పూర్వం జర్మనీ పాలకుడు హిట్లర్ తీరునే గుర్తు చేస్తోందని శివసేన దుయ్యబట్టింది.
స్వర్గీయ పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేరు ప్రతిష్టలను దెబ్బతీయడమే కాకుండా, మొత్తం గాంధీ వంశ అవకాశాలను తుడిచివేయాలని బిజెపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని శివసేన పత్రిక సామ్నా ఘాటుగా విమర్శించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఇ.డి విచారణ పట్ల కొరడా ఝళిపించింది.
అసలు గాంధీలను ప్రశ్నించడం ద్వారా బిజెపి అహంకారాన్ని, ఎవరినయినా కాలర్ పట్టుకోగలమన్న దురహంకారాన్ని తెలియజేస్తుందని సామ్నా ఘాటుగానే విమర్శించింది. ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలే రేపు ఎవరినయినా పట్టుకుని నిలదీయడానికి బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడదని పేర్కొన్నది. శివసేన, ఆర్‌జెడి, సమాజ్‌వాది పార్టీ, ఝార్ఖండ్ ముక్తిమోర్చా, కాం గ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిలో వున్నాయని, అసలు ఆ సంస్థ బిజెపీ వర్గీయులను, వారికి సంబంధించిన కార్యాలయాలు, సంస్థలపై దాడి చేయడం లేదని సామ్నా ఆరోపించింది. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చట్టం అందరికీ సమానమే అన్న సూత్రం ఎలా అమలు అవుతుందని సామ్నా ఎడిటోరియల్ ప్రశ్నించింది.
మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ (ప్రస్తుతం ఇద్దరూ జైల్లో వున్నా రు). అభిషేక్ బెనర్జీ (టిఎంసీ), సంజయ్ రౌత్, అనిల్ పరాబ్(శివసేన), లాలు ప్రసాద్ యాదవ్ (ఆర్‌జెడి) మొదలయినవారిపైనే కేసులు బనాయించడమే ఇ.డి ప్రధాన కార్యక్రమంగా వుందని సామ్నా ఆరోపిం చింది. రాహుల్‌గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నిస్తూ, ఆ సంస్థ, దాని యజమాని యంగ్ ఇండియా కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తిగత ఆసక్తి ఏమిటని ప్రశ్నించి సమాధానాలు ఎలాగ యినా రాబట్టాలని ఇ.డి ప్రయత్నిస్తోందని సామ్నా ఆరోపించింది.
అసలు ఆ కేసులో ఎఫ్ ఐఆర్ గాని నేరంగాని లేదని కాంగ్రెస్ పేర్కొంటున్నప్పటికీ రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలపై కేసు ఫైల్ చేసి, విచారణకు ఇ.డి. పిలవడానికి ఆధారలేమిటని శివసేన ప్రశ్నిస్తోంది. వాస్తవానికి ఆ కేసుకి సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాపీని కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం డిమాండ్ చేసినప్పటికీ ఇ.డి. ఇవ్వలేదని, అసలు ఆయన ప్రశ్నలకు తగిన సమాధానాలుకూడా ఇ.డి. ఇవ్వలేదని కూడా శివసేన పేర్కొన్నది.