Read more!

షర్మిల వర్సెస్ కవిత ఇద్దరికిద్దరు తగ్గేదేలే

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ ఉదంతం, చిలికి చిలికి గాలివానగా మారుతోందా? అంటే, జరుగుతన్న పరిణామాలు అలాంటి  సంకేతాలే ఇస్తున్నాయని విశ్లేషకులు  అంటున్నారు. అయితే  ఒక మంచి చేయి తిరిగిన స్క్రిప్ట్ రచయిత రాసి  తెర కెక్కించిన సినిమా స్క్రిప్ట్ లా కొడుతున్న ఈ పొలిటికల్ డ్రామా  స్క్రిప్ట్ రచయిత ఎవరు? ఈ చిత్రానికి ఎవరు ఫైనాన్సు చేస్తున్నారు? అసలు షర్మిల సాగిస్తున్న పాదయాత్రకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు అనేక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షర్మిల పాదయాత్రకు  ఎంత లేదన్నా రోజుకు, పదిలక్షలకు పైగానే ఖర్చవుతుంది అని అంటున్నారు. ఇంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియని చిదంబర రహస్యంగా మిగిలిపోయింది. 

ఒకప్పడు  వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కష్టమైందని  కేవీపీ రామచంద్ర రావు ఎంతో మంది మందు చేతులు కలిపితేనే గానీ, నిధులు సమకూరలేదని  కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎమెస్సార్,   నడిచింది వైఎస్సార్ అయినా అనడిపించింవాడు కేవీపీ అంటూ కేవీపీకి కితాబు నిచ్చారు. నిజానికి, పాదయాత్ర ప్రారంభించే సమయానికే రాజశేఖర రెడ్డి రాష్ట్ర టాలెస్ట్  లీడర్స్ లో ఒకరు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్  అప్పటికే అనేక మార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పెద్ద నాయకుడు. అలాంటి ఆయన పాదయాత్రకే నిధుల సమస్య ఎదురైనప్పుడు, అసలు ఇంత వరకు ఏమీ కానీ, అధికార పదవి వాసన అయినా తెలియని, షర్మిల పాదయాత్రకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు?  అనేది ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్నగా చర్చకు వస్తోంది.

 నిజానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో   ఆమె ఎవరు వదిలిన బాణం?  అనే మకుటం చుట్టూ చాలా చర్చ జరిగింది. ఒక దశలో ఆమెకు ఆమె భర్త  బ్రదర్ అనిల్ ద్వారా విదేశీ క్రైస్తవ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయనే అనుమానాలు వినిపించాయి. అలాగే  ప్రభత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు తెరాస నాయకత్వమే ఆమెను రంగంలోకి దింపి ఫండింగ్ రిసోర్స్  కూడా క్రియేట్ చేశారనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా డబ్బుల గురిచి సుద్దులు చెప్పే ఓ ప్రముఖ నగల వ్యాపారి పేరుకు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఇవేవీ అధరాలు లేని ఊహాగానలే కావచ్చును గానీ, ఆమె సంవత్సరం పైగా పార్టీని నడుపుతున్నారు. డబ్బులు ఖర్చుచేస్తున్నారు. నడుస్తున్నారు. సో ... ఎక్కడో ఓక దగ్గర నుంచి నిధులు అందుతున్నాయి  అందులో సందేహం లేదు. అవి ఎక్కడి నుంచి అనేది తేలవలసి ఉంది. అలాగే షర్మిల బీజేపీ వదిలిన బాణమని మరో  ప్రచారం కూడా జరిగింది. ఇప్పడు కూడా తెరాస ఎమ్మెల్సీ కవిత, ట్వీటర్ వేదికగా, ‘తాము వదిలిన బాణం తామే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ  కవిత్వ బాణం బాణం సంధించారు. 

అదలా ఉంటే, షర్మిల అరెస్ట్ ఉదంతం, చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా, షర్మిల స్టొరీ లోకి తెరాస ఎమ్మెల్సీ కవిత ఎంటర్ కావడంతో, ఆ ఇద్దరి మధ్య సాగుతున్న ట్వీట్స్ కాక రేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ. షర్మిలపై ఎమ్మెల్సీ ‘కవిత’  ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ కు ఎమ్మెల్సీ కవిత మరోసారి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అని, పొలిటికల్ టూరిస్ట్ అంటూ  కవిత ట్వీట్ చేశారు. 

 అయితే షర్మిల తగ్గేదేలే  అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఆమె రేపు (గురువారం) రాజ్ భవన్ కి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తో భేటీ కానున్నారు. తన అరెస్ట్ సహా టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడులపై గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే తన పాదయాత్రకు సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా,వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్‌ షర్మిల అరెస్ట్ సహా అందుకు దారి తీసిన పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

షర్మిల భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు చెప్పారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్‌ పేర్కొన్నారు. అందుకే, షర్మిల అరెస్ట్ ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.