ఫిర్యాదులపై తగ్గేదేలే.. మళ్లీ హస్తినకు షర్మిల..ఈ సారి ఈడీకి కంప్లైంట్
posted on Oct 20, 2022 7:08AM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి హస్తినకు పయనం అవుతున్నారు. ఈ నెల 21న ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఒక సారి హస్తినలో పర్యటించి వచ్చిన షర్మిల అప్పుడు హస్తినలో తెరాస అవినీతిపై సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాశేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిన షర్మిల ఇప్పుడు మరో సారి హస్తినకు వెళ్లనున్నారు.
ఆమె హస్తిన పర్యటనకు కారణమేమిటన్న దానిపై వైఎస్సార్ టీపీ నుంచి కానీ, స్వయంగా ఆమె నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.. కానీ ఈ సారి ఆమె హస్తిన పర్యటన అజెండా కాళేశ్వరం అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేయడమేనని అంటున్నారు. అయితే రాజకీయ వర్గాలలో మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ షర్మిల బీజేపీపైన కానీ కేంద్ర ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలూ చేయలేదు. దీంతో ఆమె ఈ సారి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో కూడా భేటీ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పకప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. షర్మిల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ టీఆర్ఎస్ పై బీజేపీ సహా అన్ని పార్టీలూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. ఒక్క షర్మిల మాత్రమే విమర్శలకు పరిమితం కాకుండా నేరుగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశారు. భారతదేశంలో జరిగిన అతి పెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని పేర్కొన్నారు. సీబీఐ ఫిర్యాదుతో ఆగకుండా ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లి ఈడీకి ఇదే విషయంపై ఫిర్యాదు చేయాలని షర్మిల భావిస్తున్నారని వైఎస్సార్ టీవీ వర్గలు చెబుతున్నాయి. ఈడీతో పాటు కేంద్ర జలశక్తి మంత్రికి కూడా కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ హస్తిన ముఖం చూడని షర్మిల ఇప్పుడు వరుసగా ఢిల్లీ పర్యటనతో జోరు పెంచడం వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. తొలి సారి ఢిల్లీ వెళ్లినప్పుడు షర్మిల నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి తెలంగాణ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మేఘా కంపెనీతో కలిసి కేసీఆర్ సర్కార్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా దాదాపు ఇరే ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అవే ఆరోపణలతో షర్మిల ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఇంత కాలం కేవలం ఆరోపణలే, కానీ ఇప్పుడు నేరుగా ఫిర్యాదు అందడంతో సీబీఐ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఎక్కువ అవుతోంది. అయితే సీబీఐకి ఫిర్యాదు చేసి ఊరుకోకుండా షర్మల ఇప్పుడు మరో సారి హస్తిన పర్యటన పెట్టుకుని ఈడీకి నేరుగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ,ఈడీ, ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరాస అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత, సమీప బంధువు, ఎమ్మెల్సీ సంతోష్ రెడ్డి పేర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.