ఏపీ కాంగ్రెస్ సారథి షర్మిల.. 21న బాధ్యతల స్వీకరణ
posted on Jan 18, 2024 @ 11:32AM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఈ నెల 21న వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. వైఎస్ షర్మిల ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఈ నెల 16న అంటే కనుమ పండుగ రోజున పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలసిందే. ఆమె నియామక పత్రాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు రోజు అంటే సంక్రాంతి పండుగ రోజు అప్పటి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు రాజీనామా సమర్పించారు. షర్మిలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సూచన మేరకే గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామాకు కొన్ని రోజుల ముందుగానే రుద్రరాజు షర్మిల రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సుముఖంగా ఉంటే తాను రాజీనామా చేస్తానని చెప్పిన సంగతి విదితమే.
సరే లాంఛనం పూర్తయ్యింది. అయితే ఆమె పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు ఎప్పటి నుంచి చేపడతారన్న విషయంపై రాజకీయవర్గాల్లో ఒకింత సందిగ్ధత ఉంది. తన కుమారుడి వివాహ పనుల్లో బిజీగా ఉన్న షర్మిల వెంటనే బాధ్యతలు స్వీకరించే అవకాశాలు లేవని పరిశీలకులు సైతం భావించారు.
అయితే షర్మిల మాత్రం ఓ వైపు కుమారుడి పెళ్లి పనుల హడావుడిలో ఉన్నా.. పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్డడంలో జాప్యం చేయలేదు. అసలు అధికారికంగా నియామక ప్రకటన రావడానికి ముందే ఆమె కార్యరంగంలో దూకేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న క్షణం నుంచీ ఆమె ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర పడేలా అడుగులు కదిపారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆయన నివాసానికి వెళ్లి అందజేసిన సందర్భంలో కానీ, ఆ తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ ను వివాహానికి ఆహ్వానించిన సమయంలో కానీ ఆమె జగన్ సర్కార్ కు డేంజర్ బెల్స్ వినిపించేలా మాట్లాడారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఏపీసీసీ చీఫ్ గా ఈ రోజు అధికారికంగా నియామకం జరిగినా, అంతకు ముందు నుంచే ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్ఠతకు తన వంతు కృషి ప్రారంభించేశారు.
ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారు.
షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలకు నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యింది. ఇప్పటి వరకూ విపక్ష పార్టీల వైపు చూస్తూ, చూసినా అక్కడ చాన్స్ దొరకదని నిరాశలో ఉన్న పలువురికి కాంగ్రెస్ బెస్ట్ అప్షన్ గా మారింది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అధ్యక్షురాలిగా చేపట్టిన క్షణం నుంచే వైసీపీ నుంచి వరదలా వలసల ప్రవాహం మొదలౌతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.