షర్మిల ఖాతాలోకే వైఎస్ బ్రాండ్!.. జగన్ కు మిగిలింది వైవీ, విజయసాయి, సజ్జలే!
posted on Jan 27, 2024 @ 1:54PM
షర్మిల ఎన్నికల రణస్థతిలో అదరగొడుతున్నారు. అన్న జగన్ ను నోరెత్తేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు, విమర్శలతో నిలదీస్తున్నారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సునాయాసంగా వైసీపీ నుంచి వైఎస్ బ్రాండ్ ను తన సొంతం చేసేసుకుంటున్నారు. తన ప్రశ్నలకు, సవాళ్లకు బదులిచ్చేందుకు కూడా వైసీపీకి మాటలు దొరకడం లేదు. ఆమె వాస్తవాలన్నిటినీ కుండబద్దలు కొట్టినట్లు జనం ముందు ఉంచుతున్నారు. ఆమె చెబుతున్నవాటిలో ఏ ఒక్క అంశాన్నీ ఖండించేందుకు కూడా వైసీపీకి అవకాశం లేకుండా పోయింది.
ఎందుకంటే ఆమె ఐదేళ్ల కిందట జరిగిన అంశాలను సూటిగా సుత్తి లేకుండా మళ్లీ జనం కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. అన్న జగన్ కోసం ఆనాడు తాను పడిన కష్టాన్ని మరో సారి గుర్తు చేస్తున్నారు. జనం కూడా ఔను నిజమే కదా అని ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. సజ్జలలు, పేర్కి నానీలు మీడియా ముందుకు వచ్చి షర్మిలపై చేస్తున్న విమర్శలు ఆమె చెబుతున్న వాస్తవాల ముందు నిలబడలేకపోతున్నాయి. వాటిని జనం అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ షర్మిలపై నిందలేసి చేతులు దులిపేసుకుందామన్న తాపత్రయమే తప్ప వైసీపీ నేతలలో షర్మిలకు దీటుగా బదులిచ్చేందుకు మేటర్ లేకుండా పోయింది. దీంతో జగన్ కూడా మీడియా ముందుకు వచ్చి తన కుటుంబాన్ని చీల్చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుని నీళ్లునమలడం తప్ప మరేం చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు.
ఇంత కాలం పరదాల మాటున దాక్కున్న జగన్ ను ఇప్పుడు ఆ పరదాలన తొలగించి చెల్లిని, తల్లిని నిలవనీడ లేకుండా తరిమేసిన దుర్మార్గుడిగా జనం ముందు నిలబెడుతున్నారు. తాజాగా తన అన్న జగన్ సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ లేరని కుండబద్దలు కొట్టేశారు. ఆ పార్టీ వైఎస్సఆర్సీపీకి కొత్త భాష్యం చెప్పారు. వైఎస్సార్సీపీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి, వి అంటే విజయసాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని వివరించారు. ఆ పార్టీలో వైఎస్సార్ లేరనీ, అది జగన్ సొంత పార్టీ అనీ, అది నియంత పార్టీ అని విమర్శలు గుప్పించారు.
జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలను దోచుకునే పార్టీ, పేదల ప్రయోజనాలు పట్టని పార్టీ అంటూ దుమ్మెత్తి పోశారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలొకి తొక్కిన పార్టీగా వైసీపీని షర్మిల అభివర్ణించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డనైన తాను తండ్రి ఆశయసాధన కోసం కాంగ్రెస్ లో చేరి అడుగులు వేస్తుంటేముప్పేట దాడి చేస్తున్నారని విమర్శించారు.
తన అన్న వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తండ్రి ఆశయాల కోసం నిలబడతారని భ్రమించాననీ, ఆ పార్టీ కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నకు అండగా నిలిచానని చెప్పారు. వైసీపీని భుజాల మీద వేసుకుని మోసానన్నారు. నా రక్తం, చెమట ధారపోసి పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చానని షర్మిల చెప్పారు.
తన రెక్కల కష్టం మీద ఎదిగి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దిన చందంగా తనపై దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని దాడులు జరిగినా బెదిరేది లేదు, అది రేది లేదని.. తాను వైఎస్సార్ బిడ్డననీ భయమన్నది తన డిక్షనరీలోనే లేదని కుండబద్దలు కొట్టారు.