షర్మిల ఎంట్రీ.. ఇక జగన్ ఎగ్జిట్టేనా!?
posted on Jan 4, 2024 @ 9:48AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. గురువారం(జనవరి 4) ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. అదే రోజు ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో క్రియీశీలంగా వ్యవహరిస్తారు. ఆమె కాంగ్రెస్ ప్రవేశం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఓటమి ఖరారై.. సిట్టింగుల మార్పు మంత్రంతో ఓటమి అంతరాన్ని తగ్గించుకోవాలని తపన పడుతున్న జగన్ కు షర్మిల కాంగ్రెస్ చేరిక మింగుడుపడదనడంలో సందేహం లేదు.
షర్మిల రాజకీయ అడుగులు ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమిని కదిపేస్తున్నాయి. మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు స్వయాన సోదరి అయిన షర్మిల అన్నకు వ్యతిరేకంగా ఏపీలో కాంగ్రెస్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించడానికి నిర్ణయించుకోవడంతో వైసీపీలో అత్యధికులు తాము మునిగిపోయే నావలో ఉన్నామని భావిస్తున్నారు. అవకాశం చిక్కితే గోడ దూకేయడమే తరువాయి అన్నట్లు వేచి చూస్తున్నారు. ఆ అవకాశం స్వయంగా జగన్ వారికి ఇచ్చినట్లు కనిపిస్తోంది. తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు చేపట్టిన సిట్టింగుల మార్పు కార్యక్రమం ద్వారా జగన్ స్వయంగా తన పార్టీ నేతలకు గోడదూకే అవకాశాన్ని కల్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీలో వచ్చే ఎన్నికలలో పోటీకి టికెట్ దక్కని ఆశావహులు, నియోజకవర్గ మార్పు పట్ల అసంతృప్తితో ఉన్న సిట్టింగులు, జగన్ వైఖరితో విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు ఇలా వైసీపీలో అసంతృప్తి, అసమ్మతి వాదులందరూ షర్మిల చేరిక తరువాత కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన అడుగులు షర్మిల వెంటేనని ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అలాగే తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరుందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. వీరిరువురే కాకుండా కేవలం వైఎస్ పై అభిమానంతో ఆయన కుమారుడి పార్టీలో కొనసాగుతున్న అనేక మంది షర్మిల బాటలో అడుగులు వేసే అవకాశాలున్నాయంటున్నారు. షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ ఏదో మేరకు బలోపేతమౌతుందనడంలో సందేహం లేదు.
అయితే అది ఓట్లు, సీట్లు గెలుచుకునేందుకు ఎంత మేరకు దోహదపడుతుందన్నది చెప్పలేం కానీ, వైసీపీ మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిలను బుజ్జగించేందుకు, ఆమె కాంగ్రెస్ గూటికి చేరకుండా ఆపేందుకు పలు ఆఫర్లతో జగన్ తరఫునుంచి రాయబేరాలు జరిగాయనీ, వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఈ రాయబారం నడిపారని, అయితే షర్మిల మాత్రం ఖరాకండీగా అన్న పంచన చేరే ప్రశక్తే లేదని తెగేసి చెప్పారనీ కూడా వార్తలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం అంటే.. ఏపీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం అవ్వడమేనని అంటున్నారు.
వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. షర్మిల ఏ పార్టీలో చేరినా మాకు అభ్యంతరం లేదు, ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల చీలేది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనంటూ, అది తమకే ప్రయోజనం అని చెప్పుకుంటున్నా.. నిజానికి షర్మిల కాంగ్రెస్ తరఫున ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించడం వల్ల జగన్ ప్రతిష్ట మసకబారడమే కాకుండా, సొంత చెల్లిని, తల్లిని రాష్ట్రం నుంచి గెంటేశారన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తల్లి విజయమ్మ కనీసం కుమారుడి ఇంటికి కూడా రావడానికి ఇష్టపడటం లేదంటున్నారు. ఆమె విజయవాడ వచ్చినా.. తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం ఎక్కలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇక రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ షర్మిల చేరిక ఏదో మేరకు పుంజుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ మై కమాండ్ షర్మిలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏపీలో కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఏపీలో తన గళం విప్పేందుకు షర్మిల రెడీ అయిపోయినట్లే తెలుస్తోంది. షర్మిల భర్త బ్రదర్ అనీల్ బుధవారం తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవితో కాకతాళీయంగా కలిశారు. ఆ సందర్భంగా ఆయన తన భార్య షర్మిల ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీలంగా పని చేయడం ఖాయమనీ, జగన్ వేధింపుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో జగన్ కు ఆయన పార్టీకీ ఎదురీత తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.