అమెరికా పర్యటన.. షర్మిల కారణమేంటి?
posted on May 18, 2024 @ 2:30PM
ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అయితే పోలింగ్ ముగిసిన తరువాత కనీసం మీడియా ముందుకు రాలేదు. ఎక్స్ వేదికగా ప్రజలకు కృతజ్ణతలు తెలిపి, గెలపుపై ధీమా వ్యక్తం చేసి చేతులు దులిపేసుకున్నారు. ఐప్యాక్ కు వీడ్కోలు లాంటి సమావేశంలో ఒక సారి కనిపించారు అంతే. ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస రావణకాష్టంలా రగులుతుంటే.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా హింసాకాండకు స్వస్తి చెప్పాలన్న పిలుపు కానీ, హింసను ఖండిస్తూ ప్రకటన కానీ చేయలేదు. కోర్టు అనుమతి తీసుకుని కుటుంబంతో విదేశాలకు చెక్కేశారు.
మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలంగ్ ముగిసిన తరువాత ఎన్నికల సరళిని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఆ తరువాత జరిగిన జరుగుతున్న హింసాకాండను ఖండించారు. హింసను అదుపు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. చంద్రబాబు కూడా హైదరాబాద్ చేరుకున్నప్పటికీ ఆయన పార్టీ శ్రేణులతో, నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని గమనిస్తూ అవసరమైన దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ ఏపీ అధినేత్రి షర్మిల మాత్రం పోలింగ్ ముగిసిన తరువాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఎక్స్ వేదికగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు. అంతే ఆమె హుటాహుటిన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో షర్మిల అమెరికా యానానికి కారణాలపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అపుపెరుగకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పోలింగ్ పూర్తియిన తరువాత తన కుమారుడు, తల్లితో గడిపేందుకు అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారనీ, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అంగీకరించారనీ పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమౌతున్నాయి. అయితే కాంగ్రెస్ వాటిని ఖండించింది. అలాగే షర్మిల సన్నిహితులు కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతో కానీ, జగన్ రెడ్డితో కానీ రాజీపడరనీ, ప్రచారంలో ఉన్న వదంతులన్నీ అవాస్తవాలనీ కరాఖండీగా చెబుతున్నారు.