చడీ చప్పుడు లేకుండా సాగుతున్న షర్మిల పరామర్శ యాత్ర
posted on Dec 12, 2014 @ 11:51AM
తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలపరుచుకొనే ప్రయత్నంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలను తన తరపున పరామర్శయాత్రకు పంపించారు. ఆమె మొదటి రౌండ్ పరామర్శ యాత్ర ముగింపుకి చేరుకొంటోంది కూడా. అయినా ఇంతవరకు ఆమె గానీ, తెరాస పార్టీ గానీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోలేదు. ఇదివరకు జగన్ యాత్రకు వస్తే తీవ్ర అభ్యంతరం చెప్పి వెనక్కి త్రిప్పి పంపిన తెరాస పార్టీ ఈసారి ఆమె యాత్రకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కనీసం పట్టించుకోలేదు కూడా. అదేవిధంగా ఆమె కూడా తన యాత్రలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా చడీ చప్పుడు చేయకుండా తను వచ్చిన పని చూసుకొంటూ ముందుకు సాగుతున్నారు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ జరుగుతున్నది మాత్రం ఇదే. సాధారణంగా జగన్ ఓదార్పు యాత్రలకి ముందు బోలెడంత పబ్లిసిటీ ఇస్తుంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయా నియోజక వర్గాలలో పార్టీ నేతలతో మంతనాలు చేస్తూ, ఇతర పార్టీల నుండి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలున్నాయి. ఇక అధికార పార్టీ మీద విమర్శలు చేయడం కూడా షరా మామూలే. కానీ అటువంటి హంగామా ఏమీ లేకుండా చాలా నిరాడంబరంగా షర్మిల యాత్ర ముగించేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః మొదటి రౌండ్ యాత్రలో తెలంగాణా ప్రజల స్పందన చూసిన తరువాత దానిని బట్టి భవిష్యత్ వ్యూహాలు సిద్దం చేసుకోవాలని భావిస్తున్నారేమో?