శాంతి భర్త ఆందోళన.. నన్ను చంపేస్తారట!
posted on Jul 26, 2024 @ 12:41PM
గిరిజన మహిళ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేసి, విజయసాయిరెడ్డి చట్ట వ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ శాంతి భర్త మదన్‌మోహన్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. తన భార్యతో సంబంధం పెట్టుకుని, అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని శాంతి భర్త మణిపాటి మదన్‌మోహన్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లకు వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి నాలుగు పేజీల లేఖను పంపారు. ఆ లేఖలో... ‘‘అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్‌రెడ్డి తమ అధికారం, ధన, కండ బలాన్ని ఉపయోగించి నా భార్య శాంతిని లోబరుచుకున్నారు. ఆమెతో సంబంధం పెట్టుకుని చట్టవ్యతిరేకంగా బిడ్డను కన్నారు. ఈ విధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్.కి చెందిన వ్యక్తిగా నాకున్న హక్కులను హరించారు. నా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా నా హక్కులను హరించినందుకు వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నా భార్యకు పుట్టిన మగబిడ్డకు తండ్రెవరో తేల్చాలి. ఈ అక్రమ సంబంధం గురించి నేను మీడియాకి బహిర్గతం చేసిన తర్వాత కొందరు వ్యక్తులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. తనకు సన్నిహితంగా వున్న పెద్దల పేర్లను బహిర్గతం చేశానన్న కోపంతో నా భార్య శాంతి కూడా నన్ను బెదిరిస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరిస్తోంది. ఆమెకు ఒకవైపు అసాంఘిక శక్తులు, మరోవైపు బ్యూరోక్రాట్లతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి, నా భార్య శాంతి.. ముగ్గురూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం వుంటున్నారు. అందువల్ల వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకున ఆదేశించాలని కోరుతున్నాను’’ అని మదన్ మోహన్ పేర్కొన్నారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మదన్‌మోహన్, ఎస్సీ, ఎస్టీ, బహుజన సంఘాల ప్రతినిధులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.