పార్టీతో కత్తులు దూస్తున్న శంకర రావు
posted on Jun 17, 2013 @ 11:56AM
గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి మళ్ళీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఆరోగ్యరీత్యా కొద్ది రోజులు మీడియాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు కొంచెం తేరుకొన్నాక మళ్ళీ తన సహజ శైలిలో రాజకీయాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు చిత్తూరు జిల్లా నుండి ఎర్రచందనం విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నాడని ఆయన సోనియా గాంధీకి ఒక లేఖ కూడా వ్రాసారు.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని ఇవాలని లేకపోతే స్పీకర్ పోడియం ముందు బైటాయిస్తామన్నారు. తనకు అవకాశం ఇస్తే ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్, గ్రీన్ ఫీల్డ్స్ తో సహా వివిధ అంశాలపై మాట్లాడాలను కొంటున్నట్లు తెలిపారు. తాను డీజీపీ దినేష్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదో, సీబీఐ చేత ఎందుకు దర్యాప్తు జరిపించట్లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దినేష్ రెడ్డి అంశాన్ని అసెంబ్లీ లో చర్చించవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన మరో పదిహేను రోజుల్లో తెలంగాణాపై కేంద్రం నుంచి ఒక స్పష్టమయిన ప్రకటన వస్తుందని చెపుతూనే, పార్టీ అధిష్టానం ఇప్పటికైనా తెలంగాణాపై ఓ స్పష్టమయిన నిర్ణయానికి రావాలని చెప్పడం ఆయన తెలంగాణా అంశంపై ఎటువంటి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని అర్ధం అవుతోంది. తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేయకపోతే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసారు. అంతే కాకుండా తెలంగాణా ఇవ్వకపోతే కాంగ్రెస్ కి మనుగడ లేదని వ్యాఖ్యానించారు. లేకుంటే ఈ విషయం పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సుంటుందని హెచ్చరించారు.
అటు పార్టీ అధిష్టానాన్ని, ఇటు ముఖ్యమంత్రిని వ్యతిరేఖిస్తు మాట్లాడుతున్న శంకర్ రావుని గమనిస్తే రానున్న ఎన్నికలలో తనకు పార్టీ టికెట్ రాదనే ఆందోళనలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్దం అని సూచిస్తునట్లు ఉంది. అయితే, ఆయన పార్టీని వీడిపోవడం వలన పార్టీ కొచ్చేనష్టం ఏమిలేకపోగా ఆయనే రాజకీయంగా నష్టపోవడం ఖాయమని గ్రహించకపోవడం రాజకీయ అజ్ఞానమే.