వెండితెరపై వెన్నెల సంతకం సావిత్రి
posted on Dec 6, 2013 @ 9:39AM
ఆమె ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఒకానొక వెండితెర అద్బుతం, అందానికి ఆమె పరియాయ పదం.. అభినయానకి ఆమె మరో పేరు… ఆమె మహానటి సావిత్రి. ఈరోజు వెండితెర మహరాణి సావిత్రి జయంతి. ఈ సందర్బంగా ఆ మహానటి సినీ ప్రరయాణంలో తాను వదిలి వెల్లిన వెండితెర ఙ్ఞాపకాల్ని ఒకసారి స్మరించుకుందాం….
తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి కొమ్మారెడ్డి సావిత్రి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని, అశేష ప్రజల హృదయాల్లో అభినేత్రి గా నిలిచిపోయారు సావిత్రి.
మహా నటి సావిత్రి 1937 డిశంబర్ 6న జన్మించారు. 12 ఏటనే సంసారం సినిమాతో మొదటి సారి తెరపై కన్పించారు. 1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. తర్వాత పాతాళభైరవి చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైంది సావిత్రి సినీ ప్రస్థానం.
పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. కాని సావిత్రిలోని అసామాన్యనటిని తెలుగుతెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు. అపురూపమైన ఆ దృశ్యకావ్యంలో దేవదాసుగా అక్కినేని... పార్వతిగా సావిత్రిల నటన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పార్వతి పాత్రలో సావిత్రి నటన అపూర్వం... అద్బుతం అనే చెప్పాలి. అమాయకమైన ప్రేయసిగా సావిత్రి అభినయం. నటనా కౌశలం వర్ణించాలంటే మాటలే సరిపోవు.
ఆ తరువాత వరుసగా ఇవి సావిత్రి మాత్రమే చేయగలదు అనే పాత్రలు ఎన్నో చేసింది ఆ మహానటి. మిస్సమ్మ, మధురవాణి,శశిరేఖ ఇలా తన నటనతో ఆమె జీవం పోసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి.
తెలుగు చలన చిత్ర చరిత్ర గురించి ప్రస్తావిస్తే అందులో మాయబజార్ గురించి చెప్పకుండా వుండలేం. అలాంటి అద్బుతమైన చిత్రంలో కథ మొత్తం సావిత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి సమయంలో శశిరేఖగా వచ్చిన ఘటోత్కచుని చూపించే సమయంలో ఒకేసారి తనలోని లావణ్యంతో పాటు ఎస్వీఆర్ లాంటి నటుని గాంభీర్యాన్ని కూడా తన ఆహార్యంలో పలికించి వహ్వా అనిపించింది సావిత్రి.
దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా... సావిత్రి ఒక అధ్యాయాన్ని సృష్టించి వెళ్లిపోయారు.
1968లో చిన్నారిపాపలు అనే సినిమాకు దర్శకత్వం వహించింది. దక్షణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది ఈ మూవీ. ఆ తరువాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు సావిత్రి.
అయితే చంద్రునిపై కూడా మచ్చలు ఉన్నట్టుగా సావిత్రి జీవితంలోనూ చీకటి కోణాలు ఉన్నాయి. తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి నిజ జీవితంలో ఘోరంగా విఫలమైయ్యరు. ఆస్తిపాస్తులు కోల్పోయి… తాగుడుకు… మత్తుమందు లకు… నిద్రమాత్రలకు బానిసై ఆ దుర్భర జీవితంలోనే ఆమె తన 44ఏటనే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లారు.
నటనలో సావిత్రి చూపించిన ప్రమాణాలు నేటికి ఆదర్శనీయంగా మిగిలాయి… ప్రతి యువనటి తాను కూడా సావిత్రి అంత నటి కావాలని ఉవ్వీళ్లూరుదుంటంది. అందుకే సావిత్రి తెలుగు సినిమా ఉద్యాన వనంలో ఎప్పుడు వాడిపోని ఓ సెల్యులాయిడ్ సుగంద పుష్పం.