మహాగౌరి అలంకరణలో శ్రీశైలం భ్రమరాంబికాదేవి
posted on Sep 30, 2025 @ 12:16PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజు మంగళవారం (సెప్టెంబర్ 30) భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి , బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవారు నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. పూజల అనంతరం వర్షం కారణంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయ పురవీధుల్లో జరగవలసిన గ్రామోత్సవం నిలుపదల చేశారు. ఆలయ ప్రాకారం లోనే స్వామి అమ్మవార్ల ఉత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం రద్దు కావడంతో ఆలయంలోనే ఉత్సవాల సందర్భంగా కేరళ చండీమేళం, కేరళ సంప్రదాయ డ్రమ్స్,కొమ్ము కోయ నృత్యం,థయ్యం సంప్రదాయ నృత్యం, విళక్కు సంప్రదాయ నృత్యం,స్వాగత నృత్యం, సంప్రదాయ నాట్యల భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూజా కార్యక్రమాలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు,ఆలయ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.