నేను 5 లక్షలు డిమాండ్ చేయలేదు: సానియా మీర్జా
posted on Dec 3, 2015 @ 7:22PM
మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్ లో నిర్వహించదలచిన ఒక క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ముఖ్య అతిధిగా పాల్గొనాలని ఆహ్వానించగా ఆమె రూ. 5 లక్షలు ఫీజు, తన మేకప్ స్టాఫ్ కి రోజుకి రూ.75, 000, తనతో వచ్చే తన సిబ్బందికి అదనంగా మరికొంత సొమ్ము చెల్లించాలని కోరారు. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తనకు చార్టెడ్ విమానం ఏర్పాటు చేయాలని కోరారు. ఆమె గొంతెమ్మ కోరికలను విని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు దణ్ణం పెట్టేసి ఆమెకు బదులు మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీ చంద్ ని ఆహ్వానించారు. ఆయన ఎటువంటి షరతులు విధించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సానియా మీర్జా రాకపోవడంతో నవంబర్ 28న జరుగవలసిన తమ క్రీడా కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిశంబర్ 1కి వాయిదా వేసుకోవలసి వచ్చింది.
దీని గురించి సానియా మీర్జాను విమర్శిస్తూ మీడియాలో వార్తలు వచ్చేయి. వాటిపై ఆమె మేనేజర్ స్పందిస్తూ, సానియా మీర్జా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రూ. 5 లక్షలు అడిగినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదు. ఆమె డబ్బు కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్నిఎటువంటి డిమాండ్స్ చేయలేదు. కానీ ఆ కార్యక్రమం జరిగిన మరునాడు అంటే నవంబర్ 29వ తేదీన ఆమె గోవాలో ఒక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. భోపాల్ లో తన కార్యక్రమం పూర్తయిన తరువాత సాధారణ విమానంలో గోవా వెళ్ళినట్లయితే ఆ కార్యక్రమానికి ఆమె అందుకోలేరు. అందుకే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయమని కోరాము. కానీ ఆమె గొంతెమ్మ కోరికలు కోరినట్లు మీడియాలో వార్తలు రావడం మాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు.