ఇక సమైక్య పోరాటం
posted on Jan 16, 2013 @ 9:18PM
కేంద్రం తన నిర్ణయం ప్రకటించే సమయం ఆసన్నమవుతున్నకొద్దీ రాష్ట్రంలో ఆంద్ర, తెలంగాణా రాజకీయాలు ఊపందుకొంటున్నాయి. రాష్ట్ర విభజన ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపద్యంలో, సీమంద్రాకు చెందిన వివిధ పార్టీల నేతలందరూ, తమ విభేదాలను, పార్టీ సిద్ధాంతాలను మళ్ళీ మరోమారు పక్కన బెట్టి సమైక్యపోరాటానికి చేతులు కలుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీమాంధ్రా మంత్రులు ఈ సమైక్య పోరాటానికి ముందు నిలుస్తున్నారు.
మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వట్టి వసంతకుమార్, టీజీ వెంకటేష్, కాసు కృష్ణారెడ్డి, శైలజానాధ్, విశ్వరూప్ ఏరాసు ప్రతాపరెడ్డితోపాటు మరో పదిమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై సమైక్యరాష్ట్రానికి అనుకూలంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో మధు యాష్కీ, రాజయ్య వంటి తెలంగాణావాదులు కూడా డిల్లీలోనే తిష్టవేసి తెలంగాణా కోసం తమ ప్రయత్నాలు తము చేస్తున్నారు.
రేపు అనగా జనవరి 17వ తేదీన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రుల క్వార్టర్స్‌లోని క్లబ్‌లో సమావేశం అవ్వాలని నిర్ణయించడంతో తెలంగాణా వాదులు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తెలంగాణా గడ్డపై తెలంగాణా వ్యతిరేఖ ఆలోచనలు చేసేవారి సమావేశాలను తప్పక అడ్డుకొంటామని ఆన్నారు. ఈ నేపద్యంలో రేపు సీమంద్రా సమావేశం జరగడం అనుమానమే.
అయితే, కేంద్రం గనుక రాష్ట్ర విభజన ప్రకటించిన మర నిమిషమే సీమంద్రా రాజకీయ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాలు మొదలుపెడతామని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. తాము ఇప్పటివరకూ పార్టీ అధిష్టానంపై నమ్మకం, గౌరవంతో ఒత్తిడి చేయలేదని, గానీ ఇప్పుడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేమాటయితే తాము తప్పనిసరిగా పార్టీకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇంతవరకు నిదానంగా వేచిచూసిన సీమంద్రా నేతలు ఇప్పుడు రంగ ప్రవేశం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఇక, రేపటినుండి రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.