సజ్జలా... ఇక నోరు మూసెయ్!
posted on Apr 13, 2024 @ 10:42AM
ఏపీలో వున్నదే ఒక పనికిమాలిన, మంచి పనులు చేయడం చేతగాని చచ్చుపుచ్చు ప్రభుత్వం. ఆ దిక్కుమాలిన ప్రభుత్వానికి పనీపాటా లేని సలహాదారులు 40 మంది. వాళ్ళలో 9 మందికి క్యాబినెట్ హోదా.. వీళ్ళకి జీతాలు, భత్యాలు, బొంగు, భోషాణం. ఈ సలహాదారుల పదవుల్లో చేరిన రాజకీయ పరాన్నభుక్తులు జనం సొమ్ము భోంచేస్తున్నారు.
జనం సొమ్ము మింగటంతో ఆగకుండా జగన్‌కి ఏవోవో దిక్కుమాలిన సలహాలు ఇస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపారేశారు. ఆలిబాబా 40 దొంగలు అని ఎప్పుడో సినిమా చూశాం.. ఇప్పుడు ఏపీలో ఆలీబాబా 40 దొంగలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ దొంగల ముఠాకి నాయకుడిగా చెప్పుకోదగ్గ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి హద్దు, అదుపు వుండదు. టీడీపీ మీద విషం కక్కడానికి ఆయన రెడీగా వుంటారు. ప్రతిరోజూ జగన్ అందించిన విషాన్ని కడుపునిండా తాగడం.. ఆ విషయాన్ని మీడియా ముందుకు వచ్చికక్కడం ఆయన దినచర్య. ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, సలహాదారులు అనే పదం వింటేనే జనం చిరాకుపడిపోయే పరిస్థితి తీసుకొచ్చిన వారిలో సజ్జలవారు అగ్రగణ్యులు.
సరే, జగన్ తిట్టమంటారు.. సజ్జలవారు తిడతారు. గతంలో ఈ తంతు జనం భరించారు.. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు కూడా సజ్జల వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడమేంటి? ప్రతిపక్షాలను తిట్టడమేంటి? తినేది జనం సొమ్ము... ఊడిగం చేసేది వైసీపీ పార్టీకా? ఇదే ప్రశ్న జనంలో ఎప్పటినుంచో వుంది.. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా ఇప్పుడు ఇదే ప్రశ్న ఎన్నికల కమిషనర్ మీనా నుంచి సజ్జలకు ఎదురైంది.
ఏవయ్యా పెద్దమనిషీ, ప్రభుత్వం సొమ్ముతింటూ వైసీపీ తరఫున మాట్లాడుతున్నావేంటి అని ఎన్నికల కమిషన్ ప్రశ్నించేసరికి సజ్జల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ప్రభుత్వ సలహాదారు హోదాలో గీత దాటిన సజ్జలతోపాటు మొత్తం 40 దొంగల మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి మిస్టర్ సజ్జలా.. ఇకనైనా నోరు మూసెయ్... ఎన్నికల కమిషన్ అక్షింతలు వేసినప్పటికీ నోరు మూసుకోవడం కష్టంగా అనిపిస్తే, అర్జెంటుగా తమరి సలహాదారు పదవికి రాజీనామా సమర్పించెయ్. ఆ తర్వాత వైపీసీ కూలీ హోదాలో తమరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవచ్చు.