అవి ఇస్తే ఎన్డీయేలో చేరే విషయం ఆలోచిస్తాం.. క్లారిటీ ఇస్తున్న వైసీపీ కీలక నేతలు..
posted on Oct 6, 2020 @ 9:46AM
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో భేటీతో పాటు ఎన్డీయేలో చేరాలంటూ బీజేపీ ఆహ్వానించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తామంటేనే తాము ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని అయన అన్నారు. అయితే ఇప్పటివరకు ఎన్డీయే లో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానమూ లేదని, అలాగే వైసీపీ సైతం ఆ ప్రతిపాదన చేయలేదని అయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్, ప్రధాని మోడీ మధ్య భేటీ జరుగనుంది. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో కలిసి జగన్ పాల్గొననున్నారు.
ఇది ఇలా ఉండగా ఇదే విషయం పై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఒక ప్రాంతీయ పార్టీగా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని. అందుకే రాష్ట్రానికి మేలు చేకూర్చే ప్రత్యేక హోదా.. తదితర అంశాల పై మాత్రమే తాము దృష్టి పెడతామని, అయితే బీజేపీ నుండి మాత్రం ఎన్డీయేలో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలిపారు.