విజయసాయికి అండగా సకల శాఖల మంత్రి సజ్జల
posted on Nov 11, 2022 @ 2:23PM
వైసీపీలో ఎవరి ప్రభ ఎప్పుడు వెలుగుతుందో.. ఎవరికి ఎప్పుడు అవమానాలు ఎదురౌతాయో ఎవరికీ అర్ధం కాదు. నిన్న అందలం ఎక్కించిన నాయకుడినే.. నేడు పార్టీలో పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసిన నాయకుడినే మళ్లీ పిలిచి పల్లకీ ఎక్కిస్తారు. అందుకు సరైన ఉదాహరణ చెప్పాలంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకు పార్టీలో ఎప్పుడు బ్రహ్మరథం పడతారో.. ఎప్పుడు విసిరి అవతల పడేస్తోరో ఎవరికీ తెలియదు. పార్టీ ఆవిర్బావం నుంచి జగన్ సీఎం అయ్యే వరకూ పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన ఆయనను ఇప్పటి వరకూ కనీసం రెండు సార్లు పక్కన పెట్టారు.
తాజాగా ఆయన వద్ద ఉన్న సామాజిక మాధ్యమ బాధ్యతలను కూడా తీసివేసిన తరువాత ఆయన ఇక పార్టీలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదని పార్టీ శ్రేణులే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో అనివార్యంగా మళ్లీ పార్టీ ఆయనను భుజాన మోయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. శరత్ చంద్రారెడ్డి సోదరుడు రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డ అల్లుడు కావడంతో.. ఈ లిక్కర్ స్కాంతో వైసీపీకి సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు శరత్ చంద్రారెడ్డి అరెస్టుకు చాలా ముందే విజయసాయిరెడ్డికి, జగన్ సతీమణి భారతి కూడా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఆ ఆరోపణల కారణంగానే జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారన్న వార్తలూ వినవచ్చాయి.
కానీ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని వెనకేసుకురాకపోతే పార్టీ నిండా మునగడం ఖాయమన్న భయం మొదలైంది. అందుకే లిక్కర్ స్కాం తో విజయసాయికి, వైసీపీకి ఏం సంబంధం అంటూ పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా సకల శాఖల మంత్రి, పార్టీలో విజయసాయి నంబర్ టూ స్థానంలో ప్రస్తతుం ఉన్నట్లు చెబుతున్న సజ్జల మీడియా ముందుకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి, సజ్జలల మధ్య సఖ్యత లేదనీ, సజ్జల కారణంగానే విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనీ పార్టీ శ్రేణుల్లో ఓ టాక్ ఉంది. ఇప్పుడు విజయసాయికి అండగా సజ్జన మీడియా ముందుకు రావడంతో పార్టీలో ఏదో జరుగుతోంది.. లిక్కర్ స్కాం ప్రకంపనలు తాడేపల్లి ప్యాలస్ ను తాకుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంతకీ గురువారం మీడియా ముందుకు వచ్చి సజ్జల ఏం చెప్పారంటే.. లిక్కర్ స్కాంలో వైసీపీకి ఏం సంబంధం లేదన్నారు. అక్కడితో ఆగితే విజయసాయికి అండగా సజ్జల నిలబడ్డారన్న చర్చే రాకపోను. కానీ ఢిల్లీలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. విజయసాయిరెడ్డికి ఒక్కతే కూమార్తె అనీ, ఆ కుమార్తె భర్త పేరు రోహిత్ రెడ్డి అనీ వరసలు చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డే తప్ప, శరత్ చంద్రారెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు. అరబిందో అనేది అతి పెద్ద అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని.. విజయసాయి విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థ ఈయన కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతుంోదని.. దానికి ఏపీ ప్రభుత్వానికీ , వైసీపీ కి, విజయసాయిరెడ్డి, జగన్ లకు ఎటువంటి సంబంధం లేదని, తమ పార్టీ ఎంపీ విజయసాయి పులి కడిగిన ముత్యమని వెనకేసుకొచ్చారు. అయితే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోందన్నది నిర్వివాదాంశమని పరిశీలకలుు అంటున్నారు.
ఎందుకంటే ఏపీలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వమే చేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్ల అమ్మకాలే జరుగుతున్నాయి. పైగా మొత్తం లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ఈ కారణాలతో రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం మాఫియా పాత్ర పోషిస్తోందన్నది విమర్శగా మాత్రమే మిగిలిపోకుండా.. ఏదో భారీ స్కాం ఉందన్న భావన జనబాహుల్యంలో కూడా నెలకొని ఉంది. ఇక అరబిందో ఎండీ శరద్ చంద్రారెడ్డికి లిక్కర్ బిజినెస్ ఉందన్నది ఆయన అరెస్టుతోనే లోకానికి తెలిసింది.
ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న బంధం, రోహిత్ రెడ్డి విజయసాయికి స్వయానా అల్లుడు కావడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటిగా ఏపీ నుంచి రోహిత్ రెడ్డిపైనే ఆరోపణలు రావడంతో.. ఢిల్లీ మద్యం కుంభకోణం తీగలకు ఏపీలో డొంకలను కదిపే శక్తి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయికి పార్టీ మద్దతుగా నిలవకపోతే మొదటికే మోసం వస్తుందన్న భయంతోనే సజ్జల విజయసాయికి అండగా మీడియా ముందుకు వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.