సీఎంకు సజ్జలే సర్వస్వం! వైసీపీ నేతల్లో ఆక్రోశం
posted on Feb 27, 2021 @ 10:14AM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రాధాన్యత, పవర్ పెరుగుతోందా అంటే ఇటు ప్రభుత్వ వర్గాల్లో, అటు పార్టీ వర్గాల్లోనూ అవుననే సమాధానమే వి వస్తోంది. గత కొంత కాలంగా ఆయన పేస్ పఫ్ ది పార్టీ, పేస్ అఫ్ ది గవర్నమెంట్.. అంతకంటే ‘వాయిస్ అఫ్ సీఎం’ గా తెర మీద కనిపిస్తున్నారు.. వినిపిస్తున్నారు.
ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా చివరకు ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయ వ్యహరాలకు సంబంధించి ఎలాంటి చిక్కు సమస్యలు ఎదురైనా సజ్జలే ట్రబుల్ షూటర్’గా తెరమీదకువస్తున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వాలన్నా ఆయనే మీడియా ముందుంటున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ వివరణ కావాలన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు, చివరకు మంత్రులు కూడా సజ్జలనే ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. సమస్య, విషయం ఏదైనా సజ్జల చేవినేస్తే సీఎంకు చేరిపోతుందనే విశ్వాసం రోజు రోజుకు పెరుగుతోంది.
ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించిన సమయంలో అందుకు సంబదించి జగన్ రెడ్డి మనసులో మాటను సజ్జలే స్వరపరిచారు. అన్న చెల్లెలు మధ్య భిన్నభిప్రాయాలున్నాయే కానీ విబేధాలు లేవన్నారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి స్పష్టత ఉందని, అందుకే తెలంగాణలో పార్టీ పెట్టే ఆలోచన విరమించుకోవాలని షర్మిలకు చెప్పామని, అయినా ఆమె తమ నిర్ణయం తాము తీసుకున్నారని సజ్జల వివరించారు. అయితే ఇక్కడ ఆయన ఏమి చెప్పారు అనేది అంత ముఖ్యం కాదు, ఎవరి తరపున చెప్పారు అన్నదే కీలకమని.. ఆ విధంగా చూసినప్పుడు ఆయన పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సలహదారుగా, ట్రబుల్ షూటర్’గానే కాకుండా ఇంకా కీలకంగా మారేందుకు వేగంగా, వ్యూహాత్మకంగా తమ ప్రధాన్యతను పెంచుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ వర్గాల్లో వినవస్తోంది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లోనూ రామకృష్ణా రెడ్డి, పార్టీ వ్యవహరాలలో కీలక పాత్రను పోషించారు.పార్టీ పత్రిక సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్’గా వ్యవహరిస్తునూ ఆయన పార్టీ కార్యకలాపాలను చక్కపెట్టారు. సుమారు పుష్కర కాలంపాటు పార్టీలో కీలక పాత్రను పోషించినా ఆయన తెర మీద కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్య మంత్రి రాజకీయ సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. కానీ ఇటీవల కాలంలో ఆయన రాజకీయ ప్రాధాన్యతగల పార్టీ ప్రధానకార్యదర్శి పాత్రలోనే ఎక్కువ, అది కూడా ప్రయత్నపూర్వకంగా కనిపిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీల విమర్శలకు, మంత్రులు, పార్టీ అధికార ప్రతినిధులకంటే ఆయనే ఎక్కువగా స్పందిస్తున్నారు. ఘాటైన సమాధానం ఇస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయలన్నా ఆయనే చేస్తున్నారు. కోర్టు వ్యవహారాల మొదలు పంచాయతీ ఎన్నికల వరకు సర్వం తానై వ్యవహరిస్తున్న సజ్జల పార్టీలో, ప్రభుత్వంలో నెంబరు టూ అన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా పురపాలక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే పనిలో సజ్జల నిమగ్న మయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో వైసీపే జిల్లా నాయకులతో సమావేసమైన ఆయన.. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. పంచాయతీ ఎన్నికలకంటే, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మరంత భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అయితే పార్టీ సీనియర్లు ముఖ్యంగా ఇంతవరకు నెంబరు 2 పొజీషన్ లో తామే ఉన్నామని అనుకున్న వారు.. సజ్జల ఎదుగుదలను ఎలా చూస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది .. ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.