సైనా ఒంటి మీద దద్దుర్లు: కామన్వెల్త్‌కి గుడ్ బై!
posted on Jul 18, 2014 @ 4:42PM
భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ దద్దుర్ల వ్యాధితో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా ఆమెను దద్దుర్లు వేధిస్తున్నాయి. అయినప్పటికీ ఆమె ఓర్చుకుంటూ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న సమయంలో సైనా నెహ్వాల్‌కు ఒంటి మీద దద్దుర్లు వచ్చాయి. అవి ఇప్పుడు ఎక్కువైపోయాయి. దాంతో ఆమె త్వరలో స్కాట్లాండ్‌లో జరుగనున్న గ్లాస్ గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ వైదొలిగింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నద్ధమవుదామని భావించిన సైనా దద్దుర్లు విపరీతమైన బాధ పెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని సైనా తెలియజేస్తూ, ‘‘ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడటానికి సిద్ధంగా లేను. నాకు ఆస్టేలియన్ ఓపెన్ తరువాత తగిన ప్రాక్టీస్ లేదు. ఆ టోర్నీలో ఒంటిపై దద్దుర్లు రావడంతో ఇంటికే పరిమితమయ్యాను. నేను కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకుండా ఉన్నాను. పూర్తి ప్రాక్టీస్ లేకుండా టోర్నీకి వెళ్లలేను. అందుచేత టోర్నీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. ప్రస్తుతం తాను వరల్డ్ చాంపియన్ షిప్, ఆసియన్ గేమ్స్ పైనే దృష్టి పెడుతున్నట్లు సైనా తెలిపింది.