రాజస్థాన్ మంత్రివర్గంలో సచిన్ టీమ్.. పంతం నెగ్గింటుకున్న పైలెట్..
posted on Nov 21, 2021 @ 8:14PM
తెర పడింది. సుమారు సంవత్సరన్నరకు పైగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ముడిపడింది. ఏడాదిన్నర క్రితం ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్’ పై తిరుగబాటు చేయడంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొదలైన రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగింది. చివరకు ఈ రోజు జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో సంక్షోభానికి శుభం కార్డ్ పడింది. మంత్రి వర్గ విస్తరణకు వీలుగా, శనివారం గహ్లోట్ మంత్రి వర్గంలోని మంత్రులందరూ రాజీనామా చేశారు, కాగా, తాజా విస్తఃరణలో అందులో నలుగురు మినహా మిగిలిన అందరికీ కొత్త మంత్రివర్గంలో స్థానం దగ్గింది.
ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ముగ్గురికి గతంలోమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 12 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో సీఎం గహ్లోత్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 30 కి చేరింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో, రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ అజయ్ మాకెన్ ముఖ్యులుగా పాల్గొన్నారు.ఈ నూతన క్యాబినెట్‌లో సచిన్ పైలట్ మద్దతుదారులకు ఎక్కువ ప్రాధాన్యమే లభించింది. రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్‌లకు తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితో పాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రి వర్గంలో నూతనంగా చోటు దక్కింది. కొత్త మంత్రివర్గంలో ఎస్సీ వర్గం నుంచి నలుగురికీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది.
కాగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ పట్ల సచిన్ పైలట్ సంతోషం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించానని ఇక ముందు కూడా, అదే విధంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పైలట్ విశ్వాసం వ్యక్తపరిచారు.