జూన్ 28న ఇంటర్ ఫలితాలు
posted on Jun 27, 2022 6:06AM
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై సందిగ్ధత తొలగింది. మంగళవారం ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత వారం రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుకో తేదీని అనధికారికంగా ప్రకటించి విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అయోమయం, గందరగోళం సృష్టించిన ఇంటర్ బోర్డు ఎట్టకేలకు మంగళవారం అంటే ఈ నెల 28న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నది.
ఇంటర్ ఫలితాల విషయంలో వదంతులను నమ్మవద్దని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫెయిలైన విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ పేర్కొన్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు మూడు వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. విద్యార్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.inవెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలియజేసింది.