సీఎం సభకొస్తే 500 రూపాయలు.. దండోరా వేసి మరీ ఆఫర్.. టీఆర్ఎస్ బరితెగింపేనా?
posted on Oct 31, 2022 @ 11:28AM
అసలే మునుగోడు.. ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభ.. జనం రాకపోతే ఉన్న ప్రతిష్ట కూడా మంటగలిసిపోతుందనుకున్నారో ఏమో.. సీఎం సభకు వస్తే 500 రూపాయలు ఇస్తామని దండోరా వేసి మరీ ప్రచారం చేసి సభకు జనాన్ని సమీకరించింది టీఆర్ఎస్. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది.
మునుగోడులో ఎలాగైనా గెలిచిన తీరాలన్న పట్టుదలతో సకల విలువలకూ, నిబంధనలకే తిలోదకాలిచ్చేసి మరీ టీఆర్ఎస్ బరి తెగిస్తోందనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ వీడియో కనిపిస్తున్నది. మునుగోడు ఉప పోరు ప్రచారం ముగింపు దశకు వచ్చేస్తున్న సమయంలో కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆదివారం ( అక్టోబర్30) ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం, బీజేపీపై విమర్శల వర్షం, హెచ్చరికల పర్వం పక్కన పెడితే.. ఆయన సభకు జనసమీకరణ చేసిన తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా.. నిబంధనల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలిచింది.
చెర్లగూడెంలో సీఎం బహిరంగ సభకు వచ్చిన వారందరికీ మనిషికి 500 రూపాయల చొప్పున ఇస్తామంటూ దందోరా వేశారు. ఈ దండోరాను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. రిగ్గింగులు, ఓటర్లకు డబ్జు పంపకాలు ప్రతిష్ఠాత్మకంగా జరగే ఎన్నికలలో మామూలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ ఇంత బహిరంగంగా, ఇంతగా బరితెగించి.. సభకు వస్తే డబ్బులిస్తాం అంటూ డబ్బు కొట్టి చాటింపు వేయడం మాత్రం ఇదే తొలి సారి అని పరిశీలకులు అంటున్నారు.
అధికార పార్టీ ఇంతగా బరితెగించడం పట్ల రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్యులలో సైతం విష్మయం వ్యక్తం అవుతున్నది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా డబ్బు కొట్టి మరీ కేసీఆర్ సభకు వచ్చిన వాళ్లకు 500 రూపాయలు ఇస్తాం అంటూ చాటింపునకు సంబంధించిన వీడియో, ఎవరైనా టీఆర్ఎస్ ను ఇబ్బందుల పాలు చయడానికి ఎవరైనా ప్లాన్ చేసినదా? లేక గులాబీ పార్టీయే బరి తెగించేసి మరీ ఇలా చాటింపు వేయించిందా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకూ ఈ వీడియోపై టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోందన్నది వాస్తవం.