బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ ?
posted on Jul 27, 2021 @ 6:46PM
మాజీ పోలీసాఫీసర్, ఇటీవల గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అది కూడా ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రాలతో పాటు దక్షిణాదిన పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీఎస్పీ లో చేరతారని ఢిల్లీలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని లీక్ చేయగా.. తాజాగా ప్రవీణ్ కుమార్ చేరిక తేదీ కూడా ఖాయమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఆగస్టు 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గజారోహణం చేయడం ఖాయంగా తెలుస్తోంది. బీఎస్పీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగును ప్రవీణ్ కుమార్ అధిరోహించబోతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమమే ఎజెండాగా రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్న ఆయన రాకతో కచ్చితంగా రాజకీయ, సామాజిక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ దిశగా స్వేరోస్ సభ్యులు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారని అంటున్నారు.
ఇప్పటికే ఇండైరెక్టుగా డిక్లేర్ చేసిన ప్రవీణ్ కుమార్
ఇక ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం అనేది లాంఛనంగానే భావించవచ్చు. ఎందుకంటే.. ఆయన గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా రాజీనామా చేయడానికి ముందే పలు సందర్భాల్లో మాయావతిని కలిసి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. దాంతోపాటు రాజీనామా చేశాక ఆయన పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా అంబేద్కర్, జ్యోతిరావుఫూలేతో పాటు కాన్షీరామ్ దార్శనికతను ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడైనా అంబేద్కర్, ఫూలేల గురించే మాట్లాడారు గానీ... కాన్షీరామ్ గురించి ఏ ఒక్క నాయకుడు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ప్రవీణ్ కుమార్ మాత్రం కాన్షీరామ్ త్యాగాన్ని, యూపీలో దళితులు అధికారంలోకి రావడానికి ఆయన పోషించిన భూమికను, స్ఫూర్తిని హైలైట్ చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే మాయావతితో భేటీలో ఏం జరిగింది... ఆయన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసి ఉంటుందో అంచనా వేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. దక్షిణాది నుంచి ఒక పోలీసాఫీసర్ బీఎస్పీలో చేరుతున్నట్టు మాయావతి చెప్పినట్టుగా వార్తలు లీకవడంతో ఆర్ఎస్ ఇంటర్వ్యూ అంశాలను పోల్చి చూసినా ఆయన బీఎస్పీలో చేరడం ఖాయమన్న విషయాన్నే రూఢి చేస్తున్నాయి.
మరోవైపు ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి రహస్యంగా వెళ్లి పలువురు లీడర్లను కలిసి వచ్చినట్టు ఊహాగానాలు వినిపించాయి. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతూ అందుకు సైద్ధాంతిక భూమిక తయారు చేసుకున్న ప్రవీణ్ కుమార్... మొత్తానికి సొంతగా పార్టీ పెట్టి చేదు ఫలితాలు రుచి చూడడం కన్నా అందరికీ తెలిసిన, భావ సారూప్యత గల పార్టీ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయమైన సమాచారం. అయితే త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రవీణ్ కుమార్ లేదా ఆయన పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. హుజురాబాద్ లో దాదాపు 50 వేల వరకు దళిత ఓటర్లు ఉన్నందున.. పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ప్రవీణ్ కుమార్ సన్నిహుతులు మాత్రం హుజురాబాద్ లో పోటీ విషయమై ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు.