స్కీంల పేరుతో రాబంధుల మాయ! గల్లా పట్టి లాగుదామన్న ప్రవీణ్ కుమార్..
posted on Jul 29, 2021 @ 7:19PM
ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్ కార్యాచరణపై మరింత క్లారిటీ ఇచ్చారు. తాను కొత్త పార్టీ పెడాతానా లేక ఇప్పుడున్న పార్టీల్ల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతానా అన్న దానిపై పరోక్ష సంకేతం ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో బహుజన సదస్సులో మాట్లాడిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. మీ సత్తా ఏంటో ఆగస్టు 8న చూపించండి అంటూ బహుజనులకు పిలుపిచ్చారు. గల్లీ గల్లీన సెలబ్రేట్ చేసుకోండని చెప్పారు. దీంతో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు ఆగస్టు8న ప్రవీణ్ కుమార్ పార్టీ ఏంటదన్నది తేలిపోనుందని స్పష్టమైంది.
కరీంనగర్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాము కరీంనగర్ కు వచ్చింది అబద్ధం ప్రచారాలు చేయడానికి కాదన్నారు. యావత్ తెలంగాణకు గుండె చప్పుడు వినిపించడానికి వచ్చామని చెప్పారు. సభకు వస్తున్న కొందరిని అరెస్ట్ చేశారన్న ప్రవీణ్ కుమార్.. తాము చట్టాన్ని అతిక్రమించినమా? కల్లోలం సృష్టించామా? అని ప్రశ్నించారు. తామేమైనా అక్రమంగా ప్రాజెక్టుల్లో డబ్బులు సంపాదించామా? అంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఫామ్ హౌస్ లు కట్టుకున్నామా? అంటూ నిలదీశారు. ఆ డబ్బులతో మేమేమన్నా ఓట్లు కొనుక్కుంటున్నామా? అని ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బహుజన రాజ్యం తెచ్చుకోవడానికి వచ్చామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను రిటైర్డ్ మెంట్ అయిన రోజునే ఎక్కడైతే ఎస్పీగా పనిచేసినో అదే కరీంనగర్ లోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఒక్క ప్రవీణ్ కుమార్ రిజైన్ చేస్తేనే ఇంతగా చేస్తున్నారు.. రేపు నా బిడ్డలు ప్రతి గ్రామం నుంచి వేలాది మంది ప్రవీణ్ కుమార్ లు వస్తారంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అసత్యాలను, సత్యాలుగా ప్రచారం చేసే వ్యవస్థ లేకపోయినా.. ఒక్కొక్కరు అగ్నికణమవుతూ మూడు కోట్ల మంది ప్రవీణ్ కుమార్ లు వస్తారన్నారు. తాను ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు ఎంతో పేదరికంలో ఉన్నారో.. ఇప్పుడు అదే పేదరికంలో ఉన్నారన్నారు ప్రవీణ్ కుమార్. 50 ఏళ్ల మీ మేనిఫెస్టోలు ఎక్కడ పోయాయి.. పేదల బతుకుల్లో ఎందుకు మార్పురాలేదని ప్రశ్నించారు.
బహుజన రాజ్యం వస్తేనే పేదల కన్నీళ్లు ఆగుతాయన్నారు ప్రవీణ్ కుమార్. ఆ రాజ్యం తామే సృష్టించుకుంటామని.. ఇవ్వకపోతే గల్లాపట్టి లాక్కుంటామన్నారు. ఉపాధిహామీ పథకంలో ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లంటా బహుజనులేనన్నారు. దళిత సాధికారత అంటున్న కేసీఆర్ కు.. ఉద్యోగాలు పోయాక సాధికారిత ఎక్కడుందని తెలియదా అని నిలదీశారు. వందల స్కీంలతో బహుజన రాజ్యం రాకుండా చేసే రాబంధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపిచ్చారు. మన దగ్గరకొచ్చి కడుపులో తలపెడతారు.. మీకు స్కీంల ఆశలు చూపితే అమ్ముడు పోతారా? అంటూ ప్రశ్నించారు. కొత్త ప్రపంచం సృష్టించేదాకా విశ్రమించొద్దన్నారు. నాయకుల మాటలు విని అమ్ముడుపోవద్దని సూచించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చట్టబద్ధంగా, శాంతియుతంగా బహుజన రాజ్యం కోసం పోరాడుతామని తెలిపారు.