రౌండప్ 2022.. పంజాబ్, హర్యాణ మధ్య రాజధాని వివాదం
posted on Dec 16, 2022 @ 12:21PM
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
ఏప్రిల్ 2022
ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది.
ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది.
ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు.
తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు.
ఏప్రిల్ 11 తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఏప్రిల్ 14 ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు.
ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు.
ఏప్రిల్ 24 ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు. ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు.