రోహిత్ వేముల దళితుడు కాదు: క్లోజింగ్ దిశగా కేసు!
posted on May 3, 2024 @ 5:58PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని, అతనికి సంబంధించిన కేసును మూసివేస్తున్నామని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల దళితుడు అని చెప్పడానికి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. దళితుడు కాకపోయినప్పటికీ రోహిత్ వేముల తన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశాడని, తాను దళితుడు కాదని బయటపడే పరిస్థితులు రావడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పోలీసులు కేసు మూసివేత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏవైనా అభ్యంతరాలు వున్నట్టయితే రోహిత్ వేముల కుటుంబ సభ్యులు కింది కోర్టులో సవాల్ చేసుకోవచ్చని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, అప్పటి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. అయితే తెలంగాణ పోలీసులు కోర్టుకు సంబంధించిన వివరాలు అవాస్తవాలని రోహిత్ వేముల కుటుంబ సభ్యులు అంటున్నారు.