రోజూ నిద్రమాత్రలు ఇచ్చి.. ఒక్కో నగ కొట్టేసి.. సోనమ్ ఇంట్లో చోరీ కలకలం..
posted on Apr 16, 2022 @ 6:32PM
వాళ్లు చాలా రిచ్. లెక్కలేనంత సంపద. ఇంట్లో కబోర్డ్స్ లోనే భారీగా బంగారు వజ్రాభరణాలు. మా ఇంట్లోకి ఎవరు వస్తారులే అనే ధీమా. ఆ నగలను పసిగట్టింది ఆ ఇంటికొచ్చిన నర్సు. విషయం మొగుడికి చెప్పింది. ఆ కిలాడీ కపుల్స్.. ఇంటి యజమానికి రోజూ నిద్ర మాత్రలు ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక.. రోజుకో నగ దొంగిలిస్తూ వచ్చారు. ఒకేసారి అంతా దోచేస్తే డౌట్ వస్తుందని.. అలా ఒక్కోటీ ఎత్తుకెళ్లారు. ఆ ఖరీదైన నగలను అమ్మేసి.. అప్పులు తీర్చేసి.. కారు కూడా కొనుక్కున్నారు. కట్ చేస్తే.. ఆ దొంగ కపుల్స్ పోలీస్ స్టేషన్లో నిజమంతా కక్కేశారు.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజాది సంపన్న కుటుంబం. వాళ్లు ఉండేది ముంబైలోనే అయినా.. వారికి ఢిల్లీలో ఖరీదైన భవనం ఉంది. అందులో ఆనంద్ అహుజా తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంట్లో 2 కోట్ల విలువైన ఆభరణాల చోరీ జరగడం కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో ఆ దొంగలెవరో బయటపడ్డారు. ఆ ఇంట్లో పని చేస్తున్న నర్సు, ఆమె భర్తే ఈ దొంగతనానికి తెగించారని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని దొంగతనం వివరాలు రాబట్టారు. ఆ ఖరీదైన దొంగతనం ఎలా జరిగిందంటే....
ఢిల్లీలోని అమృతా షెర్లింగ్ మార్గ్‌లో ఉన్న భవంతిలో ఉంటున్న సోనమ్‌కపూర్ అత్త ప్రియకు కేర్ టేకర్‌గా ఉండేందుకు అపర్ణ రీతూ వెల్సన్ అనే నర్సును నియమించారు. అయితే, ప్రియ బెడ్‌రూమ్ కబోర్డ్స్‌లో ఉన్న బంగారం, వజ్రాభరణాలు, డబ్బు.. నర్సు అపర్ణ కంటపడ్డాయి. ఈ విషయం భర్త నరేశ్ కుమార్‌కు చెప్పింది. ఆ సొమ్మంతా అపహరిస్తే.. తమకున్న అప్పులు తీరిపోతాయని భావించారు. నరేశ్ పథకం మేరకు.. ప్రియకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలిచ్చి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని అపర్ణ అపహరించేది. అలా, దొంగిలించిన బంగారం, వజ్రాభరణాలను నరేశ్ అమ్మేసి నగదుగా మార్చేవాడు. ఇలా, ఆ జంట కొన్ని నెలలపాటు దొంగతనానికి పాల్పడి.. వచ్చిన డబ్బుతో తమకున్న అప్పులన్నీ తీర్చేసింది. మిగిలిన మనీతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే, ఇంట్లో పని చేసే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలంటున్నారు. వివరాలు తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోవద్దని.. అది నర్సు అయినా, పనోళ్లైనా బ్యాక్‌గ్రౌండ్ చెక్ కంపల్సరీ అంటున్నారు పోలీసులు.