హుజూరాబాద్ బకరా ఎవరో తెలుసా ?
posted on Oct 8, 2021 @ 4:26PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్లు పర్వం ముగిసింది. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచే నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలవగా.. నామినేషన్ల ఘట్టంతో తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికను సవాల్ గా తీసుకున్న ప్రధాన పార్టీలన్ని తమ నేతలను అక్కడే మోహరించాయి. అధికార టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు గత రెండు నెలలుగా హుజురాబాద్ గల్లీ గల్లీ తిరుగుతున్నారు, ఈటల రాజేందర్ కూడా ప్రతి గ్రామం చుట్టేశారు, అయితే మిగితా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ నామినేషన్ సందర్భంగా హస్తం పార్టీ తన సత్తా చాటే ప్రయత్నం చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై కేడర్ లో జోష్ నింపారు, ఈ సందర్గంగా హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా బకరా అయ్యేది మాత్రం మంత్రి హరీష్ రావే’ అని టీపీసీసీ అధక్షుడు, రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు తనను తానూ గొప్పగా ఊహించుకుంటున్నారని అంటూ చివరకు ఆయన బొక్కబోర్లా పడడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్’ను అందలం ఎక్కించేందుకు హరీష్ రావును వ్యూహాత్మకంగా ఒక పావులా ఉపయోగించుకుంటున్నారని, రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కేందంపై యుద్దం చేస్తామంటూ చేసిన ప్రకటనను, రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కేసీఆర్’ను కాపాడుతున్నారని అన్నారు. బీజేపీ, తెరాస నాయకుల మధ్య లోపాయికారీ సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి మరో మారు ఆరోపించారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన ప్లైట్ కేసీఆరే అరెంజ్ చేశారని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు .
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే ముందు బండి సంజయ్‌కు, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే హుజూరాబాద్ లో ఎప్పుడు ప్రచారం మొదలు పెట్టేది, ఎవరెవరు ప్రచారంలో పాల్గొనేది మాత్రం రేవంత్ రెడ్డి చెప్పలేదు.