రిపబ్లిక్ డే హైలెట్స్
posted on Jan 26, 2017 9:10AM
ఈరోజు 67వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశంలో వేడుకలు ఘనంగా నిర్విహించారు. ఎవరి ప్రాంతాల్లో వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి..వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఏపీ..
ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవవందనం, శకటాల ప్రదర్శన జరిగింది. దాని తరువాత నరసింహన్ ప్రసంగిస్తూ రెండంకెల వృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతేకాదు విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సులో రూ.4.70లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని.. పెట్టుబడుల ఆకర్షణే రాష్ట్రం వృద్ధివైపు పయనిస్తుందనేందుకు నిదర్శనమని చెప్పారు. పంట సంజీవని పేరిట 10లక్షల నీటికుంటలు తవ్విస్తామని.. విభజన అనంతరం 19 నెలల అనతి కాలంలోనే రికార్డు స్థాయి వృద్ధి సాధించామని తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, హోం మంత్రి చినరాజప్ప, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, డీజీపీ జేవీరాముడు, రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ..
తెలంగాణ రాష్ట్రంలో కూడా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. గాంధీ భవన్‌లోని జరిగిన గణతంత్ర వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఢిల్లీ..
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.