కిలాడీ యాక్టర్.. స్మగ్లింగ్ లింకులు.. నాటు తుపాకులు సీజ్..
posted on May 25, 2021 @ 3:58PM
జబర్దస్త్. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ కామెడీ షో. జబర్దస్త్‌లో ఛాన్స్ రావడమే చాలా కష్టం. అందులో నటించే వారికి ఫుల్ క్రేజ్. నవ్వుతూ, నవ్విస్తూ.. సంపాదించేది సరిపోక.. కొంతమంది కమెడియన్లు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ తర్వాత పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు.
గతంలో ఓ జబర్దస్త్ నటడు వ్యభిచారం కేసులో చిక్కుకున్నాడు. తాజాగా, జబర్దస్త్‌లో నటించే మరో నటుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. ఆ నటుడు ఇంతకు ముందు కూడా ఓ సారి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడం ఆసక్తికరం.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తుండగా 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు దొరికిపోయారు వారందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు పోలీసులు.
అయితే, విచారణలో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్లకు జబర్దస్త్ నటుడు హరికి సంబంధాలు ఉన్నాయని తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఈ అంశంపై నటుడు హరి సైతం స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని.. ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని ఆరోపించాడు హరి. వీరిలో ఎవరు చెప్పేది నిజమో తదుపరి దర్యాప్తులో వెల్లడికానుంది.