ఎయిర్‌పోర్టు.. భూములకు పోటు?
posted on Mar 25, 2021 @ 2:33PM
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం. జాతికి అంకితం చేసిన సీఎం జగన్. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు. 1,008 ఎకరాల్లో.. 153కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించింది. ప్రారంభోత్సవానికి కేంద్ర ఏవియేషన్ శాఖ తరఫున ఎవరూ హాజరుకాలేదు. కేంద్ర ప్రమేయం లేకుండా కర్నూలులో ఎయిర్‌పోర్టు కట్టడమేంటి? ఏదో తేడాగా ఉందంటున్నాయి ప్రతిపక్షాలు.
ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీ. అవసరం ఉన్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే సొమ్ములు లేవు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమూ కష్టమవుతోంది. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల్లో హడావుడిగా ఎయిర్‌పోర్టు నిర్మించడం వెనక వేరే మతలబు ఉందంటున్నారు. న్యాయ రాజధాని కర్నూలు నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగేలా ఓర్వకల్లు విమానాశ్రయం ఉపయోగపడుతుందన్నారు జగన్. ఇంకా మూడు రాజధానుల వివాదం కొలిక్కిరానే లేదు. కర్నూలులో న్యాయ రాజధానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కోర్టు తరలింపు ప్రక్రియపైనా నిషేధం కొనసాగుతోంది. ఆలూలేదు సూలూ లేదు.. ఇంకా న్యాయ రాజధాని నిర్మాణమే జరగలేదు.. అలాంటిది అప్పుడే ఇంత అర్జెంట్‌గా ఎయిర్‌పోర్ట్ రెడీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కర్నూలుకు సమీపంలోనే ఒకవైపు బెంగళూరు విమానాశ్రయం, మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మధ్యలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుతో పనేంటి? అంటే, విమానాశ్రయం ముసుగులో భూముల వ్యాపారం చేసేందుకే ఇదంతా చేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ.
వెయ్యి ఎకరాల్లో విమానాశ్రయం అనగానే కర్నూలు చుట్టూ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓర్వకల్లు సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ భూములూ భారీగా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు రావడంతో ప్రభుత్వ స్థలాల ధరలూ పెరిగాయి. ఇలా ధరలు పెంచేసి.. ఆ తర్వాత భూములు అమ్మేసి.. భారీగా ఆదాయం దండుకోవాలనేది సర్కారు కుతంత్రమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు స్థలాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, ఆ భూములన్నీ ఇప్పటికే వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయని.. తమ వారికి మేలు చేసేందుకే విమానాశ్రయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇలా, ప్రభుత్వ, ప్రైవేటు భూముల ధరలు పెంచేసి.. ఆ తర్వాత వాటిని అమ్మేసేందుకే.. ఇంత హడావుడిగా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని రెడీ చేశారని అంటున్నాయి విపక్షాలు.