ఫారం హౌస్ బోను లోంచి బయటకొచ్చిన తెరాస పులి
posted on Dec 3, 2013 @ 2:08PM
‘ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని’ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు గారు చెప్పినట్లే, ‘మౌనంగా ఉండటం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని’ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చాలాసార్లు నిరూపించారు. అయితే తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవని గ్రహించిన ఆయన బయట ఉంటే తన మౌనవ్రతం కొనసాగించడం కష్టమని అప్పుడపుడు ఎవరికీ కనబడకుండా తన ఫార్మ్ హౌస్ లోకి మాయమయిపోతుంటారు.
తెలంగాణా ప్రక్రియ దాదాపు పూర్తికావస్తున్న తరుణంలో కూడా ఆయన ఫార్మ్ హౌస్ నుండి బయటకు రాకపోవడంతో తెలంగాణా వాదులు చాలా ఆందోళన చెందుతున్నారు. పులికి ఎర వేస్తే బోనులోకి వస్తుంది. కానీ కేసీఆర్ ని ఫార్మ్ హౌస్ నుండి బయటకి రప్పించాలంటే అటువంటిదేదో వేయాల్సిందేనని కాంగ్రెస్ భావించిందో ఏమో ‘రాయల తెలంగాణా’ ఎర వేసింది. ఊహించినట్లే, అది ఆయనను ఫార్మ్ హౌస్ నుండి బయటకి రప్పించింది.
ఈ రోజు మధ్యాహ్నం ఆయన తెలంగాణా భవన్ లో తెరాస నేతలతో సమావేశమయ్యి కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నఈ రాయల తెలంగాణాను ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచనలు చేస్తారు. “కాంగ్రెస్ రాయల తెలంగాణా ప్రతిపాదిస్తే దాని ఖర్మ!” అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
అంటే, చేజేతులా మళ్ళీ పరిస్థితులు మొదటికి తెచ్చుకొని, తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకుపోతుందని వేరేగా చెప్పనవసరం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణా కలిపేందుకు రాయలసీమకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు తప్ప ప్రజలు, నేతలు ఎవరూ కూడా అందుకు అంగీకరించడం లేదు. ఒకవేళ బలవంతంగా ఏర్పాటు చేసినా కాంగ్రెస్ ఊహిస్తున్నట్లు రాయల తెలంగాణా అంతటా కాకుండా, కేవలం ఆ రెండు జిల్లాలోనే విజయం సాధిస్తుందేమో!