రంగం చిత్రం సీన్ గుంటూరు సభలో ఆవిష్కృతం
posted on Jan 3, 2023 @ 10:58AM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో రంగం సినిమాలోని సీన్ ఆవిష్కృతమైందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాజకీయంగా కుట్రలు ఎలా జరుగుతాయో, రంగం చిత్రంలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. సభ నుంచి చంద్రబాబు నాయుడు నిష్క్రమించగానే, ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు తమ వంతు సేవ చేయాలని ఉద్దేశంతో చీరల పంపిణీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చీరల పంపిణీ ప్రారంభించి ఉంటే, అప్పుడే ఈ సీన్ ను సృష్టించి ఉండేవారేమో. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత పేదలకు చీరలు పంపిణీ చేపట్టారు. కొందరు సభికుల్లో కలసిపోయి ఇతర పార్టీల కార్యకర్తలతో చేరిపోయి తోపులాట జరిపితే, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. గుంటూరు సభలో సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కందుకూరు లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే, మరొక ఘటన చోటు చేసుకోవడం పరిశీలిస్తే పోలీసు వైఫల్యం, ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. వరుస సంఘటనలను పరిశీలిస్తే, ఈ ఘటన వెనుక కుట్ర కోణం తేట తెల్లం అవుతుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే 15 మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనుమానాలకు తావునిస్తోంది. మృతుల బంధువులను పట్టుకొని చంద్రబాబు నాయుడు సభలకు తమ వారిని బలవంతంగా తరలించారని చెప్పించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే మృతులను చంద్రబాబు నాయుడు సభకు బలవంతంగా తరలించారని బంధువులకు, మృతి చెందిన వారు చెప్పే అవకాశమే లేదు. అటువంటప్పుడు బలవంతంగా తరలించారని చెబుతున్నారంటే అనుమానించక తప్పదు. మృతుల బంధువులతో ఫిర్యాదు చేయించగానే, పోలీసులు ఆఘమేఘాల మీద నిర్వాహకులపై లేదంటే చంద్రబాబు నాయుడు పై ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.
చంద్రబాబునాయుడి సభలు, రోడ్ షోలకు అశేషంగా జనం వస్తున్న నేపథ్యంలో ఆయన సభలు, ర్యాలీలు నిర్వహించుకునే అవకాశం లేకుండా చేసే కుట్రతో వైసీపీయే కుట్రలు పన్నుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజే ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు రాకముందే రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం వీటిని నిషేధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోమవారం రచ్చ బండ కార్యక్రమంలో ఆయనీ మాట చెప్పారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబు సభలు, సమావేశాలను నిషేధించాలని సోమవారం (జనవరి 2) డిమాండ్ చేశారు. అసలు సెక్యూరిటీ లేని సభలకు అనుమతి ఇవ్వొద్దని వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు డిమాండ్ చేయడమే ఆశ్చర్యకరం. అసలు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారికి తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి సభలకు వేలాది మంది పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తుండగా, చంద్రబాబు సభలకు పదుల సంఖ్యలో కూడా పోలీసులు కూడా ఉండడం లేదు. గుంటూరు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకులు, మంత్రుల ప్రకటనలను పరిశీలిస్తే, ఈ సంఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని అనిపించక మానదు.