రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు
posted on Jan 28, 2014 @ 1:53PM
ఆరు రాజ్యసభ సీట్లకు మొత్తం 8మంది అభ్యర్ధులు రంగంలో మిగలడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులలో గుబులు మొదలయింది. కాంగ్రెస్ పార్టీ తరపున-సుబ్బిరామి రెడ్డి, యం.ఏ.ఖాన్, కేవీపీ రామచంద్ర రావు బరిలో ఉండగా, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో యం.యల్సీ. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్స్ దాఖలు చేసారు. గమ్మతయిన విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానాన్నిగట్టిగా ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముగ్గురూ కలిసి పార్టీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు చేయించారు. ఇక, ముప్పై మంది సీమాంధ్ర శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పుకొన్నస్వతంత్ర అభ్యర్ధి చైతన్యరాజు నామినేషన్ ఫారంపై కేవలం 10 మంది మాత్రమే సంతకాలు చేసినట్లు తాజా సమాచారం.
బొత్ససత్యనారాయణ వారిని వెంటనే తమ మద్దతు ఉపసంహరించుకోమని, లేకుంటే కటిన చర్యలు తప్పవని హెచ్చరించి, వారినందరినీ ఈరోజు సాయంత్రంలోగా తనను కలిసి సంజాయిషీలు ఇవ్వవలసినదిగా ఆదేశించారు. ఇక టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ తాము పార్టీ అభ్యర్ధికే మద్దతు ఇస్తున్నామని, ఎవరయినా తాము స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. తద్వారా అయన కూడా పార్టీకి లొంగిపోయినట్లే!
సీమాంధ్ర సభ్యుల వ్యతిరేఖతను దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ అధిష్టానం తన మిగిలిన శాసనసభ్యులను తెరాస అభ్యర్ధి కేశవ్ రావుకి మద్దతు ఇద్దామనే ఆలోచనతో ముగ్గురినే రంగంలోకి దించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదుపులోకి రావడంతో టీ-కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతోంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి కేవలం మరొక అరగంట సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, బొత్స, కిరణ్, దామోదరలు ముగ్గురు నాలుగో అభ్యర్ధిని నిలబెట్టడం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా పార్టీ అభ్యర్దులచేత నామినేషన్స్ దాఖలు చేయించారు గనుక, ఇక తిరుగుబాటు అభ్యర్దులిరువురూ వెనక్కి తగ్గకపోయినా, వారికి సీమాంధ్ర కాంగ్రెస్ శాసన సభ్యులెవరూ కూడా మద్దతు ఈయకపోవచ్చును.
అదేవిధంగా కాంగ్రెస్ తన నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దించినట్లయితే, తెరాస అభ్యర్ధి కేశవ్ రావు ఇక కాంగ్రెస్ మద్దతుపై ఆశలు వదులుకోక తప్పదు. ప్రస్తుతం ఆయనకి తెరాస-17, తెదేపా నుండి తెరాసలోకి వచ్చినవారు-5, సీపీఐ-4మంది సభ్యుల మద్దతు ఉంది. ఇంకా కనీసం మరో 10మంది మద్దతు అవసరం ఉంది. బీజేపీ-3, మజ్లిస్-7మంది సభ్యుల మద్దతు ఇచ్చినట్లయితే అయన గెలవగలరు.