గుజరాత్ కాంగ్రెస్… కన్నులొట్టవోయి చావు తప్పించుకుంటుందా?
posted on Aug 8, 2017 @ 5:32PM
ఒకప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాంగ్రెస్! ఇప్పటి కాంగ్రెస్… రాహుల్ గాంధీ కాంగ్రెస్! గాంధీ అన్న పేరు అదే అయినా, కాంగ్రెస్ అదే అయినా… పరిస్థితి మాత్రం వేరు! ఇంకా చెప్పాలంటే… దుస్థితి వేరు! గాంధీ పుట్టిన గుజరాత్ లో ముగిసిన రాజ్యసభ ఎన్నికలే ఇందుకు సంకేతం! సాక్షాత్తూ సోనియా అంతరంగికుడు అహ్మద్ పటేలే అగమ్యగోచరమైన స్థితిలో పడిపోయారు! ఇక గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు…
గుజరాత్ అంటే ఈ తరం వారికి బీజేపి అనే తెలుసు! ఎందుకంటే, గత రెండు దశాబ్దాలుగా అక్కడ హస్తం పార్టీ చేతులు కట్టుకుని కూర్చోవటం తప్ప చేసిందేం లేదు. వరుసగా కమలనాథులు అధికార పీఠం కైవసం చేసుకుంటూనే వున్నారు. మరీ ముఖ్యంగా, 2002 అల్లర్ల నెపంతో మోదీని జాతీయ విలన్ చేద్దామనుకున్న కాంగ్రెస్ ప్లాన్ బెడిసి కొట్టి పరిస్థితి మరింత దిగజారింది. గుజరాతీలు అంతకంతకూ హిందూత్వ ఎజెండాకు జై కొట్టి కాషాయ ధ్వజాన్నే నమ్ముకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కష్ట కాలం పరాకాష్ఠకు చేరినట్లే కనిపిస్తోంది…
ఒకప్పుడు కాంగ్రెస్ ను ముందుకు నడిపిన గాంధీ, పటేల్ లాంటి వారు గుజరాత్ నుంచే పుట్టుకొచ్చారు. అందుకే, కాంగ్రెస్ కూడా గాంధీ భూమిలో గట్టిగానే వుండేది. కాని, రాను రాను ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల కాలంలో గుజరాత్ పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ కంచుకోటలో గొప్ప లీడర్లు పుట్టుకురావటం మానేశారు. మరో వైపు ఆడ్వాణీ రూపంలో బీజేపికి ఆయువు పట్టు గుజరాత్ లోనే దొరికింది. సోమనాథ్ నుంచే ఆయన తన రథ యాత్ర మొదలు పెట్టి బీజేపి శకానికి నాంది పలికారు! ఆ ఊపే ఇప్పటికీ గుజరాత్ లో కనిపిస్తోంది. బీజేపి రోజురోజుకి బలపడుతూనే వుంది. ఎంతగా అంటే… ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యసభ ఎన్నికలు సోనియా, రాహుల్ కి కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి.
గుజరాత్ లో అధికారం చేపట్టటం మాట ఎప్పుడో మరిచిపోయింది అక్కడి రాష్ట్ర కాంగ్రెస్. ఇక ఇప్పుడు వున్న ఎమ్మెల్యేలు కూడా చేతి పార్టీ చేయి నుంచి మెల్లగా చేజారిపోతున్నారు. సోనియా కుడి భుజం లాంటి అహ్మద్ పటేల్ పదే పదే గెలుచుకునే రాజ్యసభ సీటు ఈ సారి సాధ్యమో, అసాధ్యమో తెలియని స్థితిలో పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ 56మందితో కావాల్సినంత మద్దతు వున్న గుజరాత్ కాంగ్రెస్ అమిత్ షా వ్యూహాలు, శంకర్ సిన్హ్ వాఘేలా తిరుగుబాటుతో చిందరవందర అయిపోయింది. ఆయన, ఆయనతో పాటూ మరో ఆరుగురు బీజేపి వైపు జంప్ కావటంతో అహ్మద్ పటేల్ కు కావాల్సిన 45మంది ఎమ్మెల్యేల మద్దతు కష్టమైపోయింది. బెంగుళూరులో దాచి పెట్టుకుని తీసుకొచ్చి ఓటింగ్ కి పంపినా కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఎన్సీపీ, జేడీయూ లాంటి పార్టీలకున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేల్ని తమకు ఓటు వేయాల్సిందిగా కాంగ్రెస్ కన్విన్స్ చేసింది! అయినా కూడా రిజల్ట్స్ వచ్చే దాకా అహ్మద్ పటేల్ భవిష్యత్తు అయోమయమే! అచ్చంగా అదే స్థితిలో వుంది గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి కూడా!
బీజేపి తరుఫున అమిత్ షా, స్మృతీ ఇరానీ తప్పక గెలిచే స్థితి వుంది. ఇక మూడో అభ్యర్థిగా కమలం వారు నిలబెట్టిన అభ్యర్థి నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ వాడే! పైగా అతడే చీఫ్ విప్ కూడా! విప్ జారీ చేయాల్సిన వ్యక్తే బీజేపిలోకి జంప్ అయ్యాడంటే గుజరాత్ కాంగ్రెస్ గందరగోళం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు! ఇందుకు కారణం కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వుండే రుగ్మతే! హైకమాండ్ కల్చర్ నీడలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవటమే పార్టీని నిండా ముంచుతోంది! అందుకు తోడు మోదీ, అమిత్ షా లాంటి బీజేపి అగ్రనాయకులు దుస్థితి మరింత దుర్భరం చేస్తున్నారు! మొత్తానికి అహ్మద్ పటేల్ ఓడితే మాత్రం సోనియా, రాహుల్ తో సహా కాంగ్రెస్ వారంతా లోపం ఎక్కడుందో ఖచ్చితంగా వెదుక్కుని తీరాలి. లేదంటే, మోదీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ కేవలం నినాదంలా వుండటం సాధ్యం కాకపోవచ్చు!