మావోయిస్టులతో మాటల్లేవ్: రాజ్‌నాథ్‌సింగ్
posted on Jun 28, 2014 @ 11:47AM
మావోయిస్టులతో చర్చించే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పేశారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మావోయిస్టుల దాడులను చేస్తే రెట్టింపు శక్తితో ఎదుర్కొంటామని, మావోయిస్టులను చావుదెబ్బ తీసేందుకు బలగాలు సర్వసన్నద్ధంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మావోయిస్టు ప్రభావిత 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఆర్పీఎఫ్ డీజీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. ‘‘మావోయిస్టులతో మెతక వైఖరికి స్వస్తి చెబుతున్నాం. ఇకపై వారితో చర్చల ప్రసక్తే లేదు. అభివృద్ధి పనులను నక్సల్స్ ఎలా అడ్డుకుంటున్నారో మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగాలి. ప్రతి రాష్ట్రంలో గ్రే హౌండ్స్ తరహా ప్రత్యేక బలగాల నియామకానికి కేంద్రం నిధులిస్తుంది. నక్సలైట్లు, వారికి తోడ్పడుతున్నవారి లొంగుబాటుకు మరింత ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీని ప్రకటిస్తాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.