బీజేపీ ఫాల్కే పాలి..ట్రిక్స్
posted on Apr 1, 2021 @ 4:08PM
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఆ అత్యుత్తమ అవార్డుకు ఆయన వంద శాతం అర్హుడు. తలైవాకి ఫాల్కే రావడం అందరికీ సంతోషం. నటనతో, తనదైన శ్టైల్‌తో, ప్రత్యేక మేనరిజంతో.. ఏళ్ల పాటు భారత ప్రేక్షకులను అలరించిన అద్బుత నటుడు రజనీకాంత్. అయితే.. ఆ తమిళ తలైవాని 'బంగారు కమలం' వరించిన సమయం, సందర్భం, విధానం మాత్రం నిస్సందేహంగా వివాదాస్పదమే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కమలనాథులు విసిరిన రాజకీయ పాచిక.. ఫాల్కే అవార్డు.
సినిమారంగంలో దేశంలోకే ఉన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రావడం కాకతాళీయమా? లేక, వ్యూహాత్మకమా? అనే అనుమానం. ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళ ఓటర్లను ఆకర్షించేందుకే కేంద్రం రజనీని ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిందని అంటున్నారు. రజనీకాంత్ కోసం అనేక నియమ, నిబంధనలను సైతం పక్కన పెట్టేశారని అంటున్నారు. తమిళనాడు ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల ముందర.. ఉన్నట్టుండి ఉరుము ఉరిమినట్టు.. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటిస్తూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.
ఫాల్కే అవార్డుకు ఎంపిక ఆశామాషీగా ఉండదు. దానికంటూ ఓ విధివిధానం ఉంది. ముగ్గురు సభ్యుల కమిటీ భేటీ అవుతుంది. దేశవ్యాప్తంగా సినిమారంగ ప్రముఖుల పేర్లను పరిశీలిస్తుంది. అందులో అత్యుత్తమ వారిని అవార్డుకు ఎంపిక చేస్తారు. అయితే, రజనీకాంత్ విషయంలో ఇలా జరగలేదు. ఫాల్కే అవార్డు ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీయే ఏర్పడ లేదు. ఎలాంటి సమావేశమూ నిర్వహించలేదు. ఫాల్కే అవార్డుకు ఇంకెవరి పేర్లూ పరిగణలోకి తీసుకోలేదు. కమిటీతో కాకుండా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్‌తోనే రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిందంటూ ట్రోలింగ్ కూడా నడుస్తోంది. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీనే రజనీకి ఫాల్కే అవార్డు కట్టబెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
బీజేపీ రాజకీయ పన్నాగాలు ఇలానే ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే.. అక్కడ వరాల జల్లు కురిపిస్తూ.. ఇలానే ఓటర్లకు బిస్కెట్లు వేస్తారని ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ.. పార్టీలన్నీ ప్రచారంతో ఊదరగొడుతున్న సమయంలో.. సడెన్‌గా రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటూ న్యూస్ రావడం సంచలనమే. ఇది ముమ్మాటికీ బీజేపీ రాజకీయ ఎత్తుగడే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. జాత్యాభిమానం అధికంగా ఉండే తమిళులు బీజేపీని అంత ఈజీగా ఆదరించే అవకాశమే లేదంటున్నారు. ఆ విషయం కమలనాథులకూ తెలియంది కాదు. అందుకే, అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకొని.. రెండాకులను అడ్డుపెట్టుకొని.. తమిళనాట కమల వికాసం కోసం కుతంత్రాలు చేస్తోంది బీజేపీ. ఎన్నికలకు ముందు ఓటర్లను మరింతగా మచ్చిగ చేసుకునేందుకే.. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారనేది రాజకీయ విమర్శ. కారణమేదైనా.. రజనీకాంత్ మాత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు హండ్రెడ్ పర్సెంట్ అర్హుడనేది అందరి మాట.